ఆర్.కృష్ణయ్య చూపు ఇప్పుడు జగన్ వైపు మళ్లింది. ఆయన వైసీపీ నిర్వహించబోయే బీసీల సదస్సుకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. లోటస్ పాండ్ లో … ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆర్.కృష్ణయ్య… బీసీల రిజర్వేషన్‌పై చట్టసభల్లో చర్చ జరపాలని వైఎస్ జగన్‌ను కోరినట్టు చెప్పుకొచ్చారు. అసలు వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ చట్టసభల్ని బహిష్కరించి చాలా కాలం అయింది. లోక్ సభ నుంచి రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. రాజీనామాలు చేయకపోయినప్పటికీ.. ఏపీ అసెంబ్లీకి పోవడం లేదు. అయినప్పటికీ.. ఆర్. కృష్ణయ్య పని గట్టుకుని వెళ్లి జగన్ ను.. బీసీ రిజర్వేషన్లపై.. చట్టసభల్లో చర్చించాలని కోరారట. అసలు విషయం ఏమిటంటే.. జగన్ బీసీల సదస్సు నిర్వహించబోతున్నారు. దానికి ఆహ్వానిస్తారేమోనని.. ఓ వినతి పత్రం పట్టుకుని ఆయన జగన్ వద్దకు వెళ్లారు. ఆ వినతి పత్రం తీసుకుని.. తన సభకు రావాలని జగన్ కోరారు. దాని కోసమే ఎదురు చూస్తున్న కృష్ణయ్య సై అనేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్. కృష్ణయ్య వేసిన వేషాలు.. అన్నీ ఇన్నీ కావు. ఎల్బీనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన… మొదటి నుంచి తేడాగా వ్యవహరిస్తూండటంతో.. తమ జాబితా నుంచి తొలగించింది. టీడీపీ టిక్కెట్ ఇస్తే ఎల్బీనగర్ నుంచే పోటీ చేస్తానని.. తన వెనుక బీసీ సంఘాలున్నాయంటూ.. కొన్ని రోజులు సమావేశాలు పెట్టి హడావుడి చేసినప్పటికీ. టీడీపీ లైట్ తీసుకుంది. ఆ తర్వాత ఆ సంఘాల పేరుతో… జానారెడ్డిని కలిసి.. తనకు సీటు ఇప్పించాల్సిందిగా అభ్యర్థించారు. టిక్కెట్ రాదని తెలిసినప్పుడు.. .కాంగ్రెస్ పార్టీ జాబితాలు విడుదల చేసినప్పుడు… తన పేరు లేనప్పుడు.. ఏకంగా బంద్ కు కూడా పిలుపునిచ్చారు. తనకు టిక్కెట్ ఇవ్వలేదని బంద్ కు పిలుపునివ్వడం ఏమిటని.. అందరూ కృష్ణయ్యేవైపు విచిత్రంగా చూశారు. ఆ తర్వాత చివరి జాబితాలో ఆయనకు మిర్యాలగూడ టిక్కెట్ ఇచ్చారు. కానీ.. ఆయన ఘోరంగా ఓడిపోయారు.
ఇప్పుడు ఏపీలో బీసీల రాజకీయం ప్రారంభవుతోంది కాబట్టి… ఆర్. కృష్ణయ్యను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ఇక వైసీపీకి అనుకూలంగా ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. అన్నట్లు.. బీసీ ఉద్యమకారునిగా అంతంతమాత్రం ఆదాయం ఉన్న ఆర్.కృష్ణయ్య.. ఆ తర్వాత కోటీశ్వరుడైపోయారు. 2014 లో టీడీపీ తరఫున ఎల్బీనగర్ నుంచి పోటీ చేసిన ఆయన.. తన కుటుంబ ఆస్తులు.. వారసత్వంగా వచ్చినవి కలిపి విలువ రూ.22.82 లక్షలుగా పేర్కొన్నారు. గత ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పోటీ చేసినప్పుడు.. అఫిడవిట్ లో తన ఆస్తులను రూ. 46.72 కోట్లుగా చూపారు. భూములు, భవనాలు, బంగారం అన్నీ పెరిగిపోయాయి. కానీ ఇంత మొత్తం ఎలా వచ్చిందో మాత్రం చెప్పలేదు. అదే రాజకీయ సీక్రెట్ కావొచ్చు.