వైసీపీ ఎందుకు అసెంబ్లీకి హాజరు కావడం లేదు? ఈ ప్రశ్నకు ఆ పార్టీ నేతల సమాధానం మనకి తెలసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలుత తీసుకోవడం లేదని. అలాగే నిజంగా వైసీపీ ఎందుకు హాజరవడం లేదో కూడా మనకు తెలిసిందే. అధినేత పాదయాత్ర నిరాటంకంగా సాగాలని, నేతలంతా దానిని సమిష్టిగా విజయవంతం చేయాలని ఇంకా అలాంటివే కొన్ని పైకి చెప్పని కారణాలున్నాయని. అదలా ఉంచితే… శుక్రవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రపతికి లేఖ రాశాడు ఆ లేఖలో తాము ఎందుకు అసెంబ్లీకి గైర్హాజరవుతున్నామో ఆయన విపులీకరించాడు.
భారత రాష్ట్రపతిని ఉద్ధేశ్యించి రాసిన 5 పేజీల లేఖలో… ఆయన చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి లాక్కున్నారని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తాము స్పీకర్, ఛైర్మన్లను కోరినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో సుపరి పాలన పడకేసిందన్నాడు.ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని, అన్నింట్లో అవినీతి తాండవిస్తోందని, ప్రభుత్వం తరపున గడచిన 41 నెలల్లో రూ.1,09,422 కోట్లు అప్పు గా తెచ్చారని వివరించాడు. వీటిపై ప్రశ్నిస్తుంటే, శాసనసభలో విపక్షం గొంతు వినపడకుండా చేస్తున్నారన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని దీనిని అడ్డుకోవాలని ఆయన రాష్ట్రపతిని కోరాడు.
ఇలాంటి లేఖలపై రాష్ట్రపతులు స్పందించిన చరిత్ర అరుదే అయినప్పటికీ… ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే దీనిని వైసీపీ సంధించినట్టు కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఓ రాష్ట్రంలో విపక్షం మొత్తం అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయించుకున్న నేపధ్యంలో ఒక్క ప్రతిపక్ష సభ్యుడూ లేకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడవనుంది. ఈ పరిస్థిత రావడంపై తమ పార్టీకి ఎటువంటి అపప్రధ రాకూడదనే ఆలోచనతో, దేశ రాజకీయ నేతల దృష్టికి ఈ ఫిరాయింపుల అంశం మరోసారి వెళ్లాలనే తలంపుతోనే వైఎస్ జగన్ రాష్ట్రపతికి లేఖ రాసినట్టుగా భావించవచ్చు.