వైసీపీ అధినేత వ్యవహారశైలి పై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏదైనా పని ఉంటే వచ్చి రెండు రోజుల పాటు ఉండి.. వెంటనే బెంగళూరు వెళ్లిపోతున్నారు. అక్కడ్నుంచి కోల్కతాకు వెళ్తున్నారో మరో చోటకు వెళ్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. కానీ ఇక్కడ ఏపీలో వైసీపీ నేతల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు పోలీసులు వెంటాడుతున్నారు.
ఒక్కొక్క నేత తాము జగన్ రెడ్డి మెప్పు పొందేందుకు చేసిన నిర్వాకాల ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎందుకైనా మంచిదని దుబాయ్ పోదామనుకున్న దేవినేని అవినాష్ ను ఫ్లైట్ ఎక్కనీయలేదు. జోగి రమేష్ తన కొడుకున చేజేతులా జైలుకు పంపుకుని కిందామీదా పడుతున్నారు. ఆయనపై చంద్రబాబు ఇంటి దాడి కేసు రెడీగా ఉంది. కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పరిష్కారం కాగానే ఆయననూ అరెస్టు చేస్తారు. ఇప్పటికే అనేక మంది ఆజ్ఞాతంలోకి వెళ్లారు. వల్లభనేని వంశీ వంటి వాళ్లు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు.
వీరందరికీ ధైర్యం చెప్పేందుకు తాడేపల్లి ప్యాలెస్ లో అందుబాటులో ఉండాల్సిన జగన్.. చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు. రాష్ట్రం దాటిన తర్వాత ఆయన ఎవరికీ అందుబాటులో ఉండటం లేదు. అసలు ఫోన్ కూడా టచ్ లో ఉండే పరిస్థితి లేదు. నిజానికి అవినీతి కేసుల్లో కన్నా.. జగన్ మెప్పు కోసం చేసిన తప్పుడు పనుల వల్లే ఇప్పుడు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. తన కోసం చేసిన వారికి కనీస ధైర్యం ఇచ్చేందుకు జగన్ ముందుకు రాకపోవడం.. తాడేపల్లి నివాసంలో ఉంటే ముళ్ల మీద ఉన్నట్లుగా ఉండి.. వీలు దొరకకగానే బెంగళూరు వెళ్లిపోవడం పార్టీ నేతల్ని విస్మయ పరుస్తోంది.