వైసీపీలో ఉన్న పరిస్థితి ఏపీ రాజకీయాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. దీనికి కారణం జగన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరే. వైసీపీకి అంటుకున్న రోగానికి ఆయన చేస్తున్న చికిత్స మాత్రం భిన్నంగా ఉంది. వైసీపీకి ప్రజల అసంతృప్తి అనే క్యాన్సర్ అంటుకుంటే.. ఆయన బాడీ పార్టులు తీసేసే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలను తీసేస్తే చాలనుకుంటున్నారు కానీ అసలు సమస్య .. ప్రజల్లో అసంతృప్తి ఎందుకు ప్రారంభమయిందో మాత్రం గుర్తించలేకపోతున్నారు.
జగన్ చర్యలతో వైసీపీ మరింత బలహీనం
వైసీపీ పరిస్థితి పూర్తిగా దిగజారిందని… దిద్దుబాటుకోసమని జగన్ తీసుకుంటున్న చర్యలు పరిస్థితిని సరిదిద్దకపోగా ఆ పార్టీని మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి. తన పార్టీ ఇంత వేగంగా ప్రజల మద్దతు కోల్పోవడానికి అసలు కారణాలు ఏమిటో గుర్తించకుండా ఎమ్మెల్యేలను బలిచేసేందుకు సిద్దమవుతున్నారు. తన పనితీరు వల్ల, తన నిర్ణయాల వల్ల, ఏకవ్యక్తి పాలన వల్ల జరుగుతున్న నష్టాన్ని గుర్తించకుండా తప్పులన్నీ కిందివారిపై మోపే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలతో అనుబంధం కోల్పోయిన వైసీపీ
జగన్ రెడ్డి తన పార్టీని తానే స్వయంగా ప్రజలకు దూరం చేశారు. గ్రామస్థాయి నాయకులు, సర్పంచులు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు- ఇలా రాష్ట్రమంతా విస్తరించి ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వ వ్యవస్థను జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వారికి ప్రభుత్వంలో ఎటువంటి పనీ, పాత్రా లేకుండా చేశారు. వారంతా జగన్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలు చెల్లని రూపాయలు అయ్యారు. ఇప్పుడు జగన్ వారు ఫెయిలయ్యారని చెప్పి, వచ్చే ఎన్నికల్లో తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ కోసం పని చేయడం మానేసిన ద్వితీయ శ్రేణి నాయకత్వం
జగన్ గెలవాలని గత ఎన్నికల్లో ఎంతెంతో ఆధారపడిన వర్గాలలో ఇప్పుడు ఎంత మంది ఆయనతో ఉన్నారు? ప్రభుత్వోద్యోగులు లేరు. సామాజిక వర్గాలు కూడా ముందటిమాదిరిగా ఏకపక్షంగా లేవు. జగన్ను నెత్తికెత్తుకున్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఇప్పుడు జగన్తో సంతృప్తిగా లేదు. రెడ్డి సామాజికవర్గానికి ప్రభుత్వంలో, పదవుల్లో పెద్ద పీట వేసినా రెడ్డి సామాజిక వర్గంలో చాలా మంది జగన్ పనితీరు చూసి దూరమయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారడం, కొందరు రాజీనామా చేయడం ఇందుకు సూచనలు. కాపు సామాజిక వర్గంలో విభజన వచ్చింది. బీసీ మంత్రం కూడా పనిచేయడం లేదు. బీసీలకు కూడా జగన్ కిరీటం పెట్టింది ఏమీ లేదని ఆ సామాజిక వర్గాలు విమర్శిస్తున్నాయి.
ఇవన్నీ జగన్ రెడ్డి చేస్తున్న తప్పులు.. చికిత్స చేయాల్సింది కూడా వీటికే కానీ జగన్ రెడ్డి.. ఎమ్మెల్యేల వల్లే తప్పు జరిగిందని నిర్ధారించి వారిని బలి చేసి.. ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారు. అది సాధ్యమేనా ?