ప్రధాని హోదాలో మోడీ కొరియాకు వెళ్తే.. కియా పరిశ్రమ వచ్చిందని.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీజే్పీ నేతలు కూడా.. ఏదో పేపర్లో కొరియా అధినేతతో కలిసి దిగిన ఫోటోతో వచ్చిన ఆర్టికల్‌ను పట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ మోడీ.. ఈ ఐదేళ్ల కాలంలో వంద దేశాలకుపైగా తిరిగారు. కియా లాంటి పరిశ్రమ దేశంలో ఇంకెక్కడైనా తెచ్చారా..? మేకిన్ ఇండియా అంటూ కేంద్రం అయిదేళ్ళుగా భారీ ప్రచారం చేసుకున్నా, దేశంలో ఎక్కడా కొత్తగా ఒక ప్రొడక్షన్ యూనిట్ మొదలైన దాఖలా లేదు.
ఏపీ స్వయంకృషితో సాధించినది కియా మోటార్స్. అతి పెద్ద ఆటోమొబైల్ ప్రాజెక్టుల్లో కియా ఒకటి. వేల కోట్ల పెట్టుబడులేకాదు.. భారీ స్థాయిలో మాన్యుఫాక్చరింగ్ జరిగే యూనిట్ కియా. దీనితో పాటు అనుబంధ పరిశ్రమలు భారీగా ఏర్పాటు అవుతున్నాయి. ఇలాంటి ప్రాజెక్టు గురించి దేశం గొప్పగా చెప్పుకుంటోంది. కియాను ఏపీకి తీసుకు రావడానికి ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చింది. మూడు నెలల్లో వారు అడిగిన సౌకర్యాలన్నీ కల్పించామని చంద్రబాబు చెప్పడమే కాదు… కియా మోటార్స్ ప్రతినిధులు కూడా కొరియాలోనూ, చైనాలోనూ ఇప్పటికే చెప్పారు. ఏపీలో పెట్టుబడుల సదస్సులో కియా ప్రతినిధులు ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ జగన్ మాత్రం కియా తెచ్చిన ఘనతను మోడీకే ఇచ్చేసారు.
జగన్ ప్రకటన సెల్ఫ్ గోల్లా మారింది. ఏపీ ఆత్మగౌరవాన్ని మరోసారి బీజేపీ మెప్పు పొందేందుకు జగన్ ఉపయోగించుకున్నారు. సాధారణ విషయాలు కూడా తన గొప్పలుగా మలచుకునే మోదీ కియాలాంటి ప్రాజెక్టును ఏపీకి వచ్చేలా చేసి ఉంటే.. వదిలేవారా..? నాలుగేళ్ళుగా హోరెత్తించేవారు. కియా ప్రతినిధులే, కొరియా పారిశ్రామిక బృందమే స్వయంగా చెప్పిన తర్వాత చంద్రబాబు కృషి అపూర్వం అని దావోస్‌లాంటి అంతర్జాతీయ వేదికలపై కూడా పొగిడిన తర్వాత మోడీకి ఆ అవకాశం లేదు. అందుకే ఆయన రెండు, మూడు సార్లు ఏపీకి వచ్చినా.. కియా గురించి చెప్పుకోలేకపోయారు.