కడప జిల్లాలో ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర రెండో రోజు సాగింది. ఈ సందర్భంగా వెంపల్లెలో స్థానికుల మధ్యన కూర్చుని, వారితో కాసేపు ముచ్చటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై యథా ప్రకారం విమర్శలు గుప్పించారు. పేదలకు ఇళ్లు ఇస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తూ… అందర్నీ చేతులు పైకెత్తి ఇలా ఇలా ఇలా లేదని చెప్పారు. దేవుడి దయవల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇళ్లు లేనివారు ఎవరూ అని అడిగితే.. ఒక్క చేయి కూడా పైకి లేచే పరిస్థితి లేకుండా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు, వైయస్ హయాంలో అందరికీ పెన్షన్లు వస్తుండేవని చెప్పారు.
ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తరువాత కొంతమంది పెన్షన్లు ఇస్తున్నారనీ, చాలామందికి ఎగరకొడతా ఉన్నారని జగన్ ఆరోపించారు. దేవుడి దయవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే… పెన్షన్ ను వెయ్యి కాదు, రూ. 2000 చేస్తానని జగన్ చెప్పారు. పొరపాటున, జగన్ చెప్పారు కదా అనీ, ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి పెన్షన్ రూ. 2000లకు చంద్రబాబు చేసినా చేస్తారన్నారు! ఒకవేళ అలా చేస్తే జగన్ చెప్పాడు కాబట్టే చేశారని గుర్తుపెట్టుకోవాలన్నారు. ‘ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు రూ. 2 కి కిలో బియ్యం ఇస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు రూ. 1. 90 పైసలకే బియ్యం అన్నారు. కానీ, ప్రజలకు అర్థమైపోయింది..ఇన్నిరోజులూ చేయలేనిది.. ఇప్పుడు ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు ఇలా చెబితే ఆ మాటలను నమ్మాలా..? ఆయన(ఎన్టీఆర్) చెప్పాడు కాబట్టి నువ్వు చేస్తున్నావని ప్రజలందరూ ఆరోజు ఆ పార్టీకి డిపాజిట్ లేకుండా చేశారు’ అని జగన్ చెప్పారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు రూ. 2 వేలు పెన్షన్ చేస్తే.. తాను దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ రూ. 3 వేలు ఇస్తా జగన్ ఉద్వేగంగా హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ రూ. 2 బియ్యం హామీ గురించి ప్రస్థావించి… జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని చెప్పాలి! ఎలా అంటే, నాడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు హమీ ఇస్తే ప్రజలు నమ్మలేదనీ, డిపాజిట్లు లేకుండా చేశారని ఆయనే చెప్పారు. ఇప్పుడు జగన్ చేస్తున్నది కూడా దాదాపు అలాంటిదే కదా మరి! ఇప్పటికే చంద్రబాబు సర్కారు వృద్ధాప్య పించెను ఇస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ప్రజల్లోకి వచ్చి దాన్ని 2 వేలు చేస్తానని జగన్ చెప్పడం ఎలా ఉందంటే… ‘నాటి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ లాంటిదే ఇదీ’ అని ఆయనే పోల్చుకున్నట్టు అవుతోంది. పైగా, నాడు కాంగ్రెస్ నేతల మాటను ప్రజలు నమ్మకుండా ఆ పార్టీకి డిపాజిట్లు లేకుండా చేశారనీ జగనే చెప్తున్నారు. అంటే, తెలుగుదేశం పార్టీకి ఘన విజయం అందించారనేది చెప్పకనే చెప్పినట్టు..! అంతేకాదు, ఎన్నికల ముందు ఇచ్చే హామీలను ప్రజలు నమ్మరూ, తిప్పి కొడతారూ అంటూ ఆయనే చెప్తున్నట్టుగా ఉంది.
అక్కడితో ఆగినా బాగుండేది! పెన్షన్ హామీ మీద మరింత గందరగోళం క్రియేట్ చేశారు. తాను రూ. 2 వేలు చెప్పాను కాబట్టి, ఎన్నికలు వచ్చేలోగా చంద్రబాబు సర్కారు ఆ మేరకు పెన్షన్ పెంచితే… అంతకంటే, ఎక్కువ ఇస్తానని మళ్లీ జగన్ చెప్పారు. ఒకవేళ చంద్రబాబు రూ. 3 వేలు ఇస్తానంటే… లేదు, లేదు నేను రూ. 4 వేలు ఇస్తానంటారేమో..! జగన్ వాదన ఇలానే ఉంది. నిజానికి, ఇవన్నీ ఏంటీ… హామీలా వేలం పాటలా..? నిన్నేమో ప్రభుత్వోద్యోగులకు ఇళ్ల ఇచ్చేస్తానన్నారు, ఇవాళ్లేమో టీడీపీ సర్కారు కంటే ఎక్కువ పెన్షన్ ఇచ్చేస్తామని చెబుతున్నారు. ప్రజలకు హామీలు ఇచ్చేముందు అవి ఆచరణ సాధ్యమా కాదా అనే లెక్కలేవీ ఉండవా..? ఇలా చేతికి ఎముక లేదన్నట్టుగా ఇష్టానుసారంగా ఏవో దానధర్మాలు చేస్తున్నట్టు హామీలు ఇచ్చేస్తారా..? రేప్పొద్దున్న వాటిని అమలు చేయడానికి కోట్లకు కోట్లు ప్రజాధనమే కదా ఖర్చు పెట్టాల్సింది. ముఖ్యమంత్రి కాబోతున్నది తానే అని చెప్పుకుంటున్నప్పుడు… ప్రజాధనంపై ఇప్పట్నుంచే కాస్తైనా బాధ్యత ఉన్నట్టు కనిపించాలి కదా!