ప్రభుత్వం అంటే అధికారవర్గం కూడా. అలాంటి అధికార వర్గాన్ని ఒక్క సారి అధికారం చేపట్టిన జగన్ పూర్తి స్థాయిలో అడ్డగోలుగా చీల్చేశారు. అడ్డగోలు అధికారులకు అందలం ఇచ్చి… వారితో ఇంకా అడ్డగోలు పనులు చేయించి… ప్రతిపక్ష పార్టీకి శత్రువులుగా మార్చారు. అధికారం పోయిన తర్వాత కూడా వదలకుండా వారికి మద్దతుగా ఉన్నట్లుగా నటిస్తూ.. వారిని బెంగళూరుకు పిలిపించుకుని మాట్లాడి.. ఆ విషయాలనూ లీక్ చేస్తున్నారు. అంటే ఆ అధికారులు మరోసారి తమ ట్రాక్‌లోకి వెళ్లి తమ ఉద్యోగం చేసుకునే చాన్స్ లేకుండా చేస్తున్నారు.
అధికార వ్యవస్థలో సివిల్ సర్వీస్ అధికారులే కీలకం. ఐఏఎస్, ఐపీఎస్‌లే పాలనను నడిపిస్తారు. వారిలో తమ వర్గం ఉందని వైసీపీ గొప్పగా చెప్పుకుంటోంది. ఇలాంటి వారికి ఇక కొత్త ప్రభుత్వంలో పోస్టింగులు రావు కదా.. చేసిన తప్పుడు పనులన్నింటికీ శిక్ష అనుభవించాల్సిందే. పైగా వారిపై నిరంతర నిఘా ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేసినా ఆ అధికారులు ఘోరమైన తప్పిదం చేసినట్లే.
జగన్‌కు ఇలాంటి అవకాశం కల్పించింది ఆ సివిల్ సర్వీస్ అధికారులే. జగన్ ను నమ్ముకుని ఎంత మంది జైలు పాలయ్యారో తెలిసి కూడా తాత్కలిక ప్రయోజనాలు, పోస్టింగులు, అవినీతి సంపాదన కోసం వారు జగన్ చెప్పినట్లుగా చేశారు. పరిస్థితి తేడాగా మారుతుందని తెలిసిన తర్వాత కూడా వెనక్కి తగ్గలేదు. చివరికి ఎన్నికల ఫలితాలకు ముందూ జగన్ కొమ్ము కాశారు. ఓడిపోయిన తర్వాత కూడా వారు బెంగళూరు వెళ్లి జగన్ ను కలిశారంటే.. వారు తమ నెత్తిపై తాము ఎలా చేయి పెట్టుకుంటున్నారో సులువుగా అర్థమవుతుంది. ఈ సివిల్ సర్వీస్ అధికారుల జీవితాలను నాశనం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అధికారవర్గంలో చీలిక తేవడంలో విజయవంతం అయ్యారు.