రాజకీయాలు పిల్లలు ఆడుకునే క్రికెట్లాంటివని…అందులో రూల్స్ అన్నీ మన ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చని.. వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. అందుకే కేంద్రంలో ఎవరికి ఎలా మద్దతివ్వాలో తనకు తానే రూల్స్ సెట్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే వారికే.. కేంద్రంలో మద్దతిస్తామని… జగన్ పశ్చిమగోదావరి జిల్లా పాదయాత్రలో మరోసారి బిగ్గరగా ప్రకటించారు. ఆ తర్వాత రెండో వాక్యమే… కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది కాబట్టి.. ఆ పార్టీని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అంటే.. జగన్ ఉద్దేశంలో ఇక మిగిలింది బీజేపీనే. ఆ పార్టీతో కలసి నడిచేందుకు ఆయనలా రూల్స్ సెట్ చేసుకున్నారన్నమాట.
భారతీయ జనతా పార్టీతో మితృత్వాన్ని ఇప్పుడు మరో స్థాయికి అంటే.. పొత్తుల వరకూ తీసుకెళ్లడం ఆయన లక్ష్యం. బీజేపీపై వ్యతిరేకత ఉందని.. ప్రజల్లో ఆగ్రహం ఉందని.. ఇప్పుడు ఆయన వెనక్కి తగ్గే అవకాశం లేదు. మోదీ గ్రాఫ్ పడిపోతోందని… అందుకే చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారని ఆ పార్టీ ఎంపీలు పదే పదే చెబుతూంటారు. అయినా గ్రాఫ్ పడితున్న మోదీని కాదనలేని పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అందుకే ఆ పార్టీతో కలసి నడుస్తామంటూ.. నేరుగా ప్రకటించకపోయినా పరోక్షంగా మాత్రం చెబుతూనే ఉన్నారు. తాజాగాగా పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఆయన అదే ప్రకటించారు. బీజేపీతోనే వెళ్లబోతున్నామని.. జగన్ ఇన్‌డైరక్ట్‌గా చెప్పినట్లయింది.
నిజానికి ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఉంది. కాంగ్రెస్ ప్లీనరీలో ఏకంగా దీనిపై తీర్మానం కూడా చేశారు. రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం హోదాపైనే పెడతారని.. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారారెడ్డి పదే పదే ప్రకటిస్తున్నారు. అదే సమయంలో… ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశమే లేదని.. బీజేపీ నేతలు రోజూ కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. అయినా సరే కాంగ్రెస్‌ను నమ్మవద్దని… బీజేపీపైనే విశ్వాసం ఉంచమన్నట్లుగా.. జగన్ ఎందుకు మాట్లాడుతున్నారన్నది రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి ఇట్టే అర్థమైపోతుంది.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జాతీయ మీడియాతో ఇదే చెప్పారు. హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేదన్నారు. అసలు ప్రత్యేకహోదా ప్రశ్నే లేదన్న బీజేపీపై మాత్రం అమితమైన విశ్వాసం ప్రకటించారు. ఇప్పుడు జగన్‌కు కూడా నేరుగా అదే చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని ఎవరూ అనుకోరు. ముఖ్యంగా ఏపీలో. కానీ జగన్మోహన్ రెడ్డిది మాత్రం విచిత్రమైన పరిస్థితి. టీడీపీ వెళ్లిపోతే.. తామున్నామన్న భరోసా బీజేపీకి ఇచ్చిందన్న ప్రచారం ఉంది. ఇప్పుడు బీజేపీపై వ్యతిరేకత ఉంది … అంటే.. ఆ పార్టీ నేతలు పగ తీర్చుకోకుండా ఉండరు. పైగా ఇప్పుడు బీజేపీ క్లిష్టపరిస్థితుల్లో ఉంది. మిత్రులందరూ దూరమవుతున్నారు. కొత్త మిత్రుల్ని దరి చేర్చుకోకపోతే.. అంటరాని పార్టీగా మారిపోయామన్న భావన వస్తోంది. అందుకే మరో ఆరు నెలల్లో అయినా ఎన్డీఏను బలోపేతం చేయాలనుకుంటోంది. అందులో వైసీపీ ఉండాలని కోరుకుంటోంది.