పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో.. కేంద్రానికి ఎదురెళ్లాలని ఏపీ సర్కార్ గట్టి పట్టుదలతో ఉంది. పీపీఏలను రద్దు చేసేందుకు … సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టుదలకు పోతున్నారు. కేంద్రం ఇప్పటికే రెండు సార్లు … పీపీఏల్లో అవినీతి జరగలేదని.. పద్దతి ప్రకారమే.. రేట్లను నిర్ణయించారని.. వాటి జోలికి పోవద్దని లేఖలు రాసింది. అయితే ఏపీ సర్కార్ మాత్రం… కేంద్రం మాటలను లెక్క పెట్టే ఆలోచన చేయడం లేదు. కచ్చితంగా… వాటిని రద్దు చేసే దిశగా అడుగు వేస్తోంది. ఈ క్రమంలో… కేంద్ర ప్రభుత్వానికి తాము ప్రత్యుత్తరాలు రాయాలని నిర్ణయించుకున్నారు. పీపీఏల సమీక్షకు..జగన్ నియమించిన కమిటీ.. విద్యుత్ ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులతో సమావేశమైంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు.. అజేయకల్లం… కేంద్రానికి ఏమీ తెలియదన్నట్లుగా.. లేఖలను తేలిగ్గా తీసి పడేశారు.
ఆంధ్రప్రదేశ్ పీపీఏల్లో అవకతవకలు జరిగాయన్న అంశం కేంద్రం దృష్టిలో ఉండకపోవచ్చునని .. ఎవరైనా రిప్రజెంట్ చేస్తే.. ఆ మేరకు లేఖలు రాసి ఉండొచ్చని.. చెప్పుకొచ్చారు. రెగ్యులర్ అడ్మినిస్ట్రేషనులో భాగంగా ఈ లేఖలు వచ్చి ఉండొచ్చని ఊహించారు. కేంద్రం రాసిన లేఖకు ప్రత్యుత్తరం తప్పనిసరిగా ఇస్తామని.. అన్ని పీపీఏలను సమీక్షించి తీరుతామని ప్రకటించారు. ఆ తర్వాత రద్దుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పీపీఏలను రివ్యూ చేసే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందని..న్యాయస్థానాలు కూడా ఈ విధానాన్ని తప్పు పట్టవనే భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి… ఆర్కేసింగ్.. వివిధ రాష్ట్రాల్లో కొనుగోలు ఒప్పందాల ధరలను కూడా పంపారు. వాటితో పోలిస్తే.. ఏపీలో తక్కువ ధరకే.. కొనుగోలు జరిగిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ.. విద్యుత్ కంపెనీలకు ఎక్కువ ధర చెల్లించారని.. సీఎం నమ్మకంతో ఉన్నారు. ఆయన నమ్మకానికి తగ్గట్లుగా.. కేంద్రం చెప్పినా సరే.. పీపీఏలను రద్దు చేయాలనే పట్టుదలతో కమిటీ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పవన, సౌర విద్యుత్ ధరలు తగ్గాయని.. అజేయకల్లాం చెబుతున్నారు. పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రాకుండా పోతాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు తగినంత కరెంటు ఉన్నప్పటికీ.. ఎక్కువ కొనుగోళ్లు చేస్తున్నట్లుగా… అజేయకల్లాం చెప్పుకొచ్చారు. గ్రీన్ కో, వెన్యూ, మైత్ర, పవర్ ట్రేడింగ్ కార్పోరేషన్, ఈకో రన్,
యాక్సిస్ వంటి సంస్ధల నుంచి 70 శాతం విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నామని.. వీటికి ఎక్కువ ధర ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం రెండు సార్లు చెప్పినప్పటికీ.. ఏపీ సర్కార్.. పీపీఏల విషయంలో మొండి పట్టుదలకు పోతూండటం… ఆసక్తి రేపుతోంది. కేంద్రంతో ఏపీ సర్కార్ ఘర్షణ వైఖరికి వెళ్తోందా అన్న అభిప్రాయం ఏర్పడుతోంది.