అన్న పిలుపు అంటూ ఒక కార్యక్రమాన్ని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏ పార్టీ పట్లా ప్రత్యేకమైన అభిమానం ప్రదర్శించనివారిని ఎంపిక చేసి, వారికి ఉత్తరాలు రాసి, వారితో సమావేశాలు నిర్వహించాలని వైకాపా భావించింది. ఎన్నికల్లో తటస్థుల ఓట్లే విజయాన్ని నిర్ధారిస్తాయన్న వ్యూహంతోనే వారికి ఆకర్షించే ప్రయత్నం ఇదనేది అర్థమౌతూనే ఉంది. అయితే, ఈ కార్యక్రమ నిర్వహణపై సొంత పార్టీ నాయకులపైనే జగన్ కొంత అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
దాదాపు 70 వేల మంది తటస్థులకు ఇప్పటికే వైకాపా అధినేత పేరుతో లేఖలు వెళ్లాయి. వీరందరినీ దశలవారీగా కలిసి, సమావేశాలు ఏర్పాటు చేసి, వారి సూచనలు తీసుకోవాలన్నది జగన్ ప్రణాళిక. ఇంకోపక్క, సమర శంఖారావ సభల్ని కూడా జగన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు కొన్ని గంటల ముందు తటస్థులతో జగన్ భేటీ అవుతున్నారు. తిరుపతి, అనంతపురం, కడప శంఖారావ సభల్లో కూడా ఇలానే తటస్థులతో సమావేశమయ్యారు. ఇంకేముంది… సమావేశాలు బాగానే జరుగుతున్నాయి కదా అనిపించొచ్చు! అయితే, ఈ తటస్థుల పేరుతో జగన్ సమావేశాలకు వైకాపా అభిమానులే ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతున్నారట. తటస్థులతో పేరుతో అభిమానుల్ని ఆ పార్టీ నాయకులే జగన్ సభలకు పంపుతున్నారట. అనంతపురంలో జరిగిన అన్న పిలుపునకు మొత్తం 300 మంది హాజరయ్యారు. వీరిలో దాదాపు 180 వైకాపా కార్యకర్తలున్నారని జగన్ దృష్టికి వచ్చినట్టు సమాచారం. తాడిపత్రి, అనంతపురం వైకాపా నేతలే ఇలా అభిమానులతో సభను నింపే ప్రయత్నం చేశారని జగన్ తెలిసిందట. దీంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి.
హైదరాబాద్ లో జగన్ నిర్వహించిన కార్యక్రమంలోనూ వైకాపా అభిమనులే ఎక్కువగా ఉన్నట్టు పార్టీ నేతలే వ్యవహరించారట! లేఖలు పంపినవారితో మాత్రమే జగన్ భేటీ అవుతారన్నారని ఓపక్క గొప్పగా చెప్తారు! కానీ, ఇప్పుడు వైకాపా నేతలు పంపినవారు కూడా తటస్థుల పేరుతో జగన్ సభల్లో కూర్చుంటున్నారన్నమాట. ఈ లెక్కన అన్న పిలుపులో వ్యక్తమౌతున్న అభిప్రాయాలను నూటికి నూరుశాతం తటస్థుల మనోభావంగా భావించకూడదన్నమాట. అన్న పిలుపులో డొల్లతనాన్ని ఆ పార్టీవారే బయటపెట్టుకున్నట్టయింది.