వైయస్సార్ భార్యగా చెబుతున్నా… తన తండ్రిలానే జగన్ కూడా మాట ఇస్తే తప్పడు అన్నారు వైకాపా గౌరవధ్యక్షురాలు విజయమ్మ. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తూ, ఎన్నికల ప్రచారసభలో ఈ అంశం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడ కష్టం ఉందని తెలిస్తే, అక్కడికి జగన్ వెళ్లి ఓదార్చుతాడన్నారు. నెలలో 25 రోజులు ప్రజల్లోనే ఉంటాడన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎన్నో దీక్షలు ధర్నాలు చేశాడనీ, ఏడెదిమిది రోజులపాటు కడుపు మాడ్చుకుని మీ కోసం నిరాహార దీక్షలు చేశాడు అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి జగన్ ను అక్రమ కేసుల్లో ఇరికించారన్నారు విజయమ్మ! జగన్ కి ఒక్కసారి అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం తీసుకొచ్చి.. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తాడనీ, మాట ఇచ్చాడంటే తప్పడని విజయమ్మ అన్నారు.
జగన్ మాట ఇస్తే తప్పడు… ఇదే మాటను ఆయన పనితీరుకు కొలమానంగా వైకాపా నేతలు తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. జగన్ మాట మీద నిలబడతాడు అనే బ్రాండ్ ఇమేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పట్నుంచో చేస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నం ఫలించాలన్నా, ఇచ్చిన మాట మీద జగన్ నిలబడే ఉంటారని ప్రజలు నమ్మాలన్నా… అలాంటి అనుభవాలు, ఘటనలు ఏవైనా కొన్ని ఉండాలి కదా! ఇదిగో… ఫలానా అంశంపై జగన్ మాటిచ్చారు, ఇచ్చినట్టుగానే ఫలానా పని చేసి చూపించారు అని చెప్పుకోవడానికి వైకాపా దగ్గర కొన్నైనా ఉండాలి. అలాంటివి ఏవైనా ఉంటే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బాగా వర్కౌట్ అవుతాయి. కానీ, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… జగన్ ఇచ్చిన మాటంటూ ఏదీ లేదు, దాని మీద నిలబడి ఏదో సాధించిన సందర్భమూ కనిపించడం లేదు.
ఆయన అధికారంలో లేరు కదా, అధికారం వస్తేనే కదా ఆయన మాట మీద ఎంతగా నిలబడతాడో తెలిసేది అని వాదించేవారూ లేకపోలేదు. అంటే… జగన్ మాట ఇస్తే తప్పడు అనే ట్యాగ్ టైన్… జగన్ అధికారంలో ఉంటేనే వర్తిస్తుందా? ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన దీన్ని నిరూపించుకునే ప్రయత్నం చెయ్యొచ్చు కదా. ప్రజల తరఫున పోరాడతాననే కదా… ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించింది! మరి, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడాన్ని ఎలా చూడాలి… మాట తప్పినట్టా, మడమ తిప్పినట్టా? ఆంధ్రాకి కేంద్రమే అన్యాయం చేసిందనేది అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడాలి కదా. మరి, మోడీపై ధీటుగా జగన్ పోరాడలేకపోయిన సందర్భాన్ని ఎలా చూడాలి… మాట తప్పినట్టా, మడమ తిప్పినట్టా? ఇలా చెప్పుకుంటే వెళ్లాలంటే చాలా ఉంటాయి. ఏదో ఒక అంశం, ఏదో సందర్భం, ఏదో ఒక సమస్య… జగన్ మాటిచ్చారు, ప్రతిపక్ష నాయకుడిగా నిలబెట్టుకున్నారు అనే ఉదాహరణ ప్రజలకు వైకాపా చెప్పాలి. అప్పుడే ఆ ట్యాగ్ లైన్ కి విశ్వసనీయత పెరుగుతుంది. అప్పుడే జగన్ మాటిస్తే నిలబడగలరా అనేది తేలుతుంది.