వైసీపీలో ఏదో జరగబోతోందని ఆ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. కానీ అదేంటో చాలా మందికి క్లారిటీ లేదు. జగన్ వచ్చే నెలలో లండన్ వెళ్లాలనుకుంటున్నారు. ఆయన కుమార్తెల చదువు ఎప్పుడో అయినప్పటికీ … చదువుకుంటున్న కుమార్తెను చూడటానికనని పిటిషన్లు వేసి అనుమతి తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఆయనకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ గట్టిగా వాదించినా పర్మిషన్ వస్తుందనే అనుకుంటున్నారు.
గతంలో కూడా సీబీఐ ఎప్పుడూ ఆయన విదేశీ పర్యటన పిటిషన్లపై సానుకూలంగా స్పందించలేదు. తీవ్రంగానే వ్యతిరేకించింది. అయినప్పటికి సీబీఐ కోర్టు ఆయనకు విదేశీ పర్యటనలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కూడా అనుమతి వస్తుందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. అయితే ఈ సారి ఫ్లైట్ ఎక్కడానికి జగన్ ఒకటికి రెండు సార్లు ఆలోచించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి కారణం.. తాను ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడటమే.
జగన్ అందుబాటులో లేరని తెలిసిన తర్వాత రాజ్యసభ సభ్యులు ఎవరి దారికి వెళ్తారో.. ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలు ఎవరి నాయకత్వంలోకి వెళ్తారో అంచనా వేయడం కష్టం. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ రాజకీయం వైసీపీ నేతల్ని కంగారు పెడుతోంది. అనవసరంగా ఎమ్మెల్సీ ఇచ్చామా.. ఆ స్థానం వదిలేసుకున్నా బాగుండేమో అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన మండలిలో ప్రతిపక్ష నేత. ప్రభుత్వం వద్ద పలుకుబడి ఉంటుంది. అందుకే ఏదైనా చేయాలనుకుంటే చేస్తారని కంగారు పడుతున్నారు. బొత్సకతు చాలా ప్లాన్లు ఉన్నాయని… జగన్ ఫ్లైట్ ఎక్కిన తర్వాతే అసలు సినిమా ఉంటుందన్న సెటైర్లు వైసీపీలోనే వినిపిస్తున్నాయి.