జగన్ రెడ్డి హోదా యోధుడు అని గతంలో వైసీపీ ప్రచారం చేసుకుంది. అప్పట్లో ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఆయన హోదా యోధుడే. తనకు ప్రతిపక్ష హోదా సాధించేందుకు ఆయన అలుపెరుగని పోరాటం చేస్తున్నారు . అందు కోసం చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు. మొదట బెదిరిస్తున్నారు.. తర్వాత హెచ్చరిస్తున్నారు… బెదిరింపుల్లాంటి హెచ్చరికలు, విజ్ఞాపనలు చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు.
జగన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయబోయే కారణాల్లో ఒకటి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం. ఆ విషయాన్ని ఆయనే తన ప్రకటనలో చెప్పుకున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రశ్నిస్తాననే తనకు ఆ హోదా ఇవ్వడం లేదని జగన్ ఆరోపణ. ఆయన వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్. ఏపీలో ఆ పార్టీ తప్ప… మరో పార్టీ విపక్షంగా అసెంబ్లీలో లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం వస్తే ఆయనకే వస్తుంది. కానీ జగన్ మాత్రం హోదా వస్తేనే మాట్లాడతానంటున్నారు.
Also Read : శ్వేతపత్రాలపై జగన్ మౌనం ఎందుకు?
ప్రతిపక్ష హోదా వస్తే కేబినెట్ ర్యాంక్ వస్తుంది. అదొక్కటి తప్ప మిగతా ఏ విషయాల్లోనూ ఎఫెక్ట్ చూపదు. ఆయన ప్రతిపక్ష నేత అయినా… తమ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినా… సభలో ఉన్న బలం మేరకే మాట్లాడేందుకు సమయం కేటాయిస్తారు. అవి బిజినెస్ రూల్స్. దీని కోసం ఆయన ఢిల్లీలో సైతం ధర్నా చేసి.. తనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వడం లేదని గగ్గోలు పెడితే నవ్వుల పాలవుతారు. హోదా యోధుడు ఈ నవ్వుల్ని పట్టించుకోకుండా సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నారు.