తెలంగాణ ప్రజల మేలు కోసం పోరాడాలి అని నాన్న తన గుండెల పై విల్లు రాశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అమెరికాలో వ్యాఖ్యానించారు. ఆమెరికా పర్యటనలో ఉన్న ఆమె కాపెల్లోని ఓ హోటల్లో పార్టీ సానుభూతిపరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు అని నాన్న నాకు చెప్పినట్లు అనిపించిందని.. .తెలంగాణ ప్రజలను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నాన్న చెప్పారని అన్నారు. తను ను ప్రేమించిన ప్రజలు..నేను ప్రేమించిన ప్రజలు అని నాన్న చెప్పాడని.. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టానన్నారు. వైఎస్సార్ పార్టీ జెండాలో వైఎస్సార్ ఉన్నాడు..అజెండా లో వైఎస్సార్ సంక్షేమం ఉందని.. మళ్లీ రాజన్న పాలన తీసుకొస్తామన్నారు.
ఇవ్వాళ వైఎస్సార్ గారు బ్రతికి ఉన్నా… తెలంగాణ ముఖ్యమా..? ఆంధ్రా ముఖ్యమా అంటే సమాధానం చెప్పలేరన్నారు. వైఎస్సార్ ను అమితంగా ప్రేమించిన తెలంగాణ ఈరోజు ఎలా ఉందో అందరూ గమనించాలన్నారు. ఉద్యమ కారుడు కదా అని పాలన చేతిలో పెడితే.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. 8 న్నర ఏళ్లలో 8 వేల మంది రైతు .. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ప్రారంభించిన ఒక్క పథకం తెలంగాణలో అమలు కావడం లేదన్నారు. వైఎస్ఆర్ ఐదేళ్లే సీఎంగా ఉన్నా ప్రజల గుండెల్లో ఉండిపోయేలా పాలన నిర్వహించారన్నారు.
షర్మిల పాదయాత్రను నర్సంపేట దగ్గర అడ్డుకున్న తర్వాత కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. అయితే తర్వాత వ్యక్తిగత పర్యటన, పండుగల కారణంగా అమెరికా వెళ్లారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తారు. అమెరికా తెలుగు వారు ఎక్కువగా ఉండే డాలస్ దగ్గర కాపెల్ సిటీలోని ఓ హోటల్లో షర్మిల సన్నిహితులు సమావేశం ఏర్పాటు చేశారు. ఉచిత భోజనం, పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసి.. కుటుంబంతో కలసి రావాలని పెద్ద ఎత్తున ఆహ్వానాలు పంపారు. అయితే చాలా పరిమిత సంఖ్యలోనే హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కూడా హాజరు కాలేదు.