వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల రోజూ ఒకే ఎపిసోడ్ రిపీట్ చేస్తున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లినప్పుడు జరిగిన పరిణామాలతో బోలెడంత మైలేజ్ వచ్చిందని అనుకున్నారేమో కానీ. . శుక్రవారం కూడా మళ్లీ అదే ప్లాన్ అమలు చేశారు. కానీ ప్రజలు పట్టించుకోలేదు. కానీ ఇదేం రాజకీయం అనుకోవడం కామన్ అయిపోయింది. తన పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం దగ్గర ఓ ఇరవై మందితో ధర్నాకు కూర్చున్నారు. పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని ఇంటి దగ్గర విడిచి పెట్టారు.
షర్మిల ఇంట్లోకి వెళ్లకుండా రోడ్డుపైనే కూర్చుని నిరసన చేపట్టారు. అంతగా దీక్ష చేయాలనుకుంటే.. ఇంట్లో టెంట్ వేసుకుని కూర్చుని చేయవచ్చు. రోడ్డుపై కూర్చుని చేయడంతో పోలీసులు మళ్లీ ఇంట్లోకి తరలించారు. అక్కడా సీన్ క్రియేట్ చేశారు. షర్మిలకు తోడు మళ్లీ విజయలక్ష్మి తెర మీదకు వస్తారు. ఆమె కూడా కారు డోర్ ఓపెన్ చేసుకుని కారులో కూర్చుని నిరసన తెలిపారు. ఇదంతా చూసే వాళ్లకు ఓ ప్రహసనంలా . . షర్మిల కావాలని చేసుకున్నట్లుగా ఉంటోంది కానీ.. ఆమెపై వేధింపులు జరుగుతున్నాయని అనుకునేలా లేదు.
ఏపీలో వారు చేసిన రాజకీయాలు అందరూ చూశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఇలాంటి రాజకీయాలే చేశారు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. అందుకే ప్రతీ దాన్ని స్క్రిప్టెడ్ అన్నట్లుగా చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. రోజూ ఒకటే స్క్రిప్ట్ సరిపోదని.. ప్లాన్ మార్చాలని అంటున్నారు వరంగల్ పోలీసులు పాదయాత్రుకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లాలి. షరతులకు లోబడి అనుమతి ఇవ్వాలని కోర్టు చెప్పింది. బీజేపీ నేత బండి సంజయ్ కూడా అదే చేశారు. కానీ షర్మిల మాత్రం రోడ్డుపై ధర్నాలు చేసి కొత్త రాజకీయం చేస్తున్నారు.