వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని షర్మిల క్లెయిమ్ చేసుకున్నారు. తమ వల్లే గెలిచారు కాబట్టి.. కాంగ్రెస్ కు ఆ కృతజ్ఞతాభావం ఉందన్నారు. అందుకే తమను కాంగ్రెస్ పార్టీలోకి పిలిచారన్నారు. ఇడుపులపాయలో కుమారుడి వివాహ ఆహ్వానపత్రికను వైఎస్ సమాధి దగ్గర ఉంచిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరికను కన్ఫర్మ్ చేశారు. బుధవారం ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. అయితే తెలంగాణలో తమ వల్లే గెలిచిందని చెప్పుకోవడానికి షర్మిల ఏ మాత్రం సంకోచించడం లేదు. అంతకు ముందు పార్టీ ముఖ్య నేతల పేరుతో ఓ సమావేశాన్ని లోటస్ పాండ్ లో నిర్వహించారు.
ఆ సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియాకు లీక్ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సి ఉందని చెప్పారని అంటున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలి పదవి ఇస్తామంటున్నారని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అన్నదానిపై తర్వాత నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారని తెలిసింది. అయితే తాను ఏఐసీసీలో ఉంటానా.. ఏపీపీసీసీలో ఉంటానా అన్నది రెండు రోజుల్లో తెలుస్తుందని షర్మిల తెలిపారు.
షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి పంపాలని రాహుల్ గాంధీ పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. తెలంగాణలో రాజకీయాలు చేసే చాన్స్ ఆమెకు ఇవ్వరని.. ఏపీలో మాత్రం ఇస్తారని అంటున్నారు. పదవుల విషయంలో క్లారిటీ రాలేదు. షర్మిలను చేర్చుకోవడం మాత్రం ఖాయమని ఆ తర్వాత జరగబోయే పరిణామాలు హైకమాండ్ వ్యూహాన్ని బట్టి ఉంటాయంటున్నారు.