ఓటేసే ముందు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఒక్కసారి గుర్తుచేసుకోండి, ఆరోజులు మళ్లీ రావాలంటే జగన్ ని గెలిపించుకోవాలంటూ వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ సెంటిమెంట్ ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల కూడా ఇదే అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని, ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తూ, ముఖ్యమంత్రి పదవి ఔన్నత్యం గురించి మాట్లాడుతున్నారు. అయితే, విజయమ్మ ప్రచారంలో ఇప్పుడు కొత్తగా ప్రముఖంగా కనిపిస్తున్న అంశం ఏంటంటే… జగన్ వస్తేనే అభివృద్ధి అనే వాదం నుంచి సానుభూతివైపు ప్రచారం మారుతోంది!
రాజశేఖర్ రెడ్డి చనిపోయాక రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందనీ, జగన్ ను ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారనీ, టీడీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కలిసి కేసులు పెట్టించారని విజయమ్మ అన్నారు. ఆస్తులన్నీ అటాచ్ చేసి, తమని రోడ్డు మీదికి లాగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినాసరే, జగన్ తన కష్టాలనూ బాధలనూ ఏనాడూ ప్రజలకు చెప్పుకోలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం కడుపుమాడ్చుకుని దీక్షలు చేశాడన్నారు. ప్రజలకు ఎక్కడ కష్టం ఉందని తెలిస్తే, అక్కడ వాలిపోయాడన్నారు. మీ ఆశీర్వాద బలంతో పెద్ద గండం నుంచి జగన్ బయటపడ్డారు అంటూ విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడిని గుర్తుచేశారు. ప్రజలకీ జగన్ కీ ఉన్న బంధం ఎవ్వరూ విడదీయలేనిదనీ, జగన్ కి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ విజయమ్మ మాట్లాడారు.
జగన్ వస్తే రాజశేఖర్ రెడ్డి హయాంలో మాదిరిగా అది చేస్తాడూ ఇది చేస్తాడూ అని సాగుతూ వస్తున్న ప్రచారంలో… ఇప్పుడీ సానుభూతి కోణాన్ని విజయమ్మ జోడిస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించేవారిని ఈ సానుభూతి కోణం ఆకర్షిస్తుందా అనేదే ప్రశ్న? నవ్యాంధ్ర అవసరాలను ప్రస్థావిస్తూ, వాటిని జగన్ మాత్రమే తీర్చగలరు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ…. ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగితే కొంత ఆలోచనాత్మకంగా ఉంటుంది. అంతేగానీ… జగన్ కష్టాలుపడ్డారు, కేసుల వల్ల ఇబ్బందులుపడ్డారు, అయినాసరే ఏనాడూ ప్రజల దగ్గరకి వచ్చి చెప్పుకోలేదు, ప్రజల కష్టాలే విన్నారు… అంటూ ఈ తరహా చర్చను తీసుకొచ్చి, ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటే… దీన్లో జగన్ వ్యక్తిగతమే ఎక్కువగా కనిపిస్తోంది! రాష్ట్ర అవసరాలతో మ్యాచ్ కావడం లేదు కదా! ఏపీ ప్రజల మూడ్ రాష్ట్ర భవిష్యత్తు కోణంలో ఉంది. దాన్ని అడ్రస్ చేస్తూ వైకాపా నాయకుల ప్రసంగాలు, ప్రచారాలు ఉంటే జగన్ కి ఒక అవకాశం ఇవ్వాలన్న చర్చకు బలం చేకూరినట్టు అవుతుంది.