వైసీపీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ అమరావతి ప్రాంతంలో సీక్రెట్‌గా పర్యటించారు. ఓ ఎస్కార్ట్ వాహనం మాత్రమే వెంట రాగా ప్రత్యేకమైన కారులో ఆమె రాజధానిలో నిర్మించిన రహదారులు, భవనాలను అన్నింటినీ పరిశీలించారు. తాడేపల్లి ఇంటి నుంచి పర్యటన ప్రారంభమైంది. సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా ….. పయనించిన అన్ని భవనాలను చూసినట్లుగా తెలుస్తోంది. అయితే.. పరిశీలన అంతా కారు దిగకుండానే చేశారు. కారులో నుంచే భవనాలను చూశారు. సెక్రటేరియట్ గోడ ముందు ఉన్న రహదారి నుంచి వెళ్తూ …. ఐఏఎస్, ఐపీఎస్‌ల కోసం నిర్మించిన భవనాలతో సహా మొత్తం రాజధాని కట్టడాలను చూసినట్లుగా తెలుస్తోంది.
అమరావతి లో ఏమీ లేదని వైసీపీ చాలా కాలంగా చెబుతూ వస్తోంది. అదే నినాదానికి కట్టుబడి ఉంది. అక్కడ కనిపిస్తున్న భవనాలు అన్నీ తాత్కాలికమైనవేనని వాదిస్తోంది. శాశ్వతభవనాలు నిర్మించలేదన్న కారణంగానే రాజధానిని తరలిస్తున్నామని వైసీపీ మంత్రులు చెబుతూ ఉంటారు. అయితే అక్కడ పదివేల కోట్ల కుపై ప్రజాధనం ఖర్చు పెట్టారని.. 33 వేల ఎకరాలు ఇచ్చిన 29వేల మంది రైతుల త్యాగం ఉందని… టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. అయితే.. వైసీపీ మాత్రం రాజధాని మార్పు అంశంలో ఎలాంటి పునరాలోచన పెట్టుకోలేదు కానీ.. వాటికి గత ప్రభుత్వం పెట్టిన సొమ్మును ఎలా రాబట్టుకోవాలన్న అంశంపై మాత్రం అనేక రకాల ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. గతంలో బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతంలో పర్యటించి.. అమ్మితే ఎంత వస్తాయన్నదానిపై సీఆర్డీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇప్పుడు వైఎస్ విజయమ్మ రాజధాని నిర్మాణాలను పరిశీలించడం దేనికో వైసీపీ నేతలకు కూడా క్లూ లెస్‌గానే ఉంది. మామూలుగా అయితే… కారులో నుంచే పరిశీలించారు కాబట్టి.. ఎవరికీ తెలిసే అవకాశం లేదు. వైసీపీ వర్గాలే.. మీడియాకు లీక్ ఇచ్చాయి. విజయమ్మ అమరావతి నిర్మాణాలను పరిశీలించారని చెప్పుకొచ్చాయి. దీంతో అమరావతి విషయంలో వైసీపీ భిన్నమైన ప్రణాళికతో ముందుకెళ్లబోతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.