హైదరాబాద్: విజయవాడ నగరంలో ఇవాళ పోటా పోటీగా ధర్నాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంకోసం జరుగుతున్న భూసేకరణతీరుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్పొరేట్ సంస్థలకు రాజధాని నిర్మించాలన్న దుర్బుద్ధితో రైతులు ఒప్పుకోకపోయినా ప్రజల కన్నీటితో రాజధాని నిర్మించేందుకు సిద్ధమయ్యారని జగన్ ఆరోపించారు. అధికారం ఉంది కదా అని మదమెక్కిన మనస్తత్వంతో బలవంతంగా భూసేకరణకు పాల్పడుతున్నారని అన్నారు. భూములు కోల్పోయిన రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మరోవైపు జగన్ దీక్షకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా నాయకులు కనువిప్పు ధర్నా పేరుతో కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో గాంధీ విగ్రహంవద్ద ధర్నాకు దిగారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సెజ్లపేరుతో భూములు స్వాధీనంచేసుకున్నారని టీడీపీ కృష్ణాజిల్లా నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. లక్షకోట్లు అక్రమంగా సంపాదించిన జగన్కు భూముల సేకరణపై ధర్నా చేసే అర్హత లేదని అన్నారు. అక్రమాస్తుల కేసులలో ఇరుక్కుపోయిన జగన్, ప్రజలకోసం ఉద్యమం చేస్తాననటం హాస్యాస్పదమని విమర్శించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది విష్ణు, దేవినేని నెహ్రూ తదితరులు ఆంధ్రరత్న భవన్వద్ద ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేకహోదాపై చంద్రబాబు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం దిష్టిబొమ్మను తగలబెట్టారు.