ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ… టిక్కెట్ల పంపిణీపై దృష్టి సారిస్తున్నారు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో అతితక్కువ ఓట్ల తేడాతో చేజారిన అసెంబ్లీ స్థానాలు చాలానే ఉన్నాయి. కాబట్టి, ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి పొరపాట్లూ జరగకూడదని జగన్ భావిస్తున్నారట. అయితే, ఇతర పార్టీల నుంచి చేర్చుకునేవారు కూడా సీట్లు ఆశించే వస్తారు కదా! అలాంటివారి విషయంలో వైకాపా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. ఇతర పార్టీల నుంచి వైకాపాలోకి వస్తున్న నాయకులకు సంబంధించిన పూర్తి వివరాలను జగన్ క్షుణ్ణంగా పరిశీలిస్తారట. దీని కోసం కొందరు వైకాపా నాయకులతో ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా నియమించినట్టుగా తెలుస్తోంది.
వలస నేతలకు స్థానికంగా ఉన్న ఆదరణతోపాటు, ఆర్థికంగా వారి స్థాయి ఎలా ఉంది, ఎన్నికల్లో పార్టీ తరఫున ఎంతవరకూ ఖర్చు చేయగల స్థోమత ఉందీ అనే అంశాలపై ముందుగా దృష్టి పెడుతున్నట్టు సమాచారం. ఎవరైనా వైకాపాలోకి చేరాలనుకుంటే… జగన్ కంటే ముందుగానే ఆ కమిటీని సంప్రదించాల్సి ఉంటుందని తెలుస్తోంది. కమిటీ సభ్యులు అడిగిన సమాచారమంతా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ టిక్కెట్ లభిస్తే ఎంత ఖర్చు చేయగలరనేది కూడా కమిటీ సభ్యులకు చెప్పాల్సి ఉంటుందట! పార్టీ నుంచి వారు ఆశిస్తున్నదేంటనేది కూడా కమిటీకి చెప్పాలట! వైకాపాలో చేరబోయే నాయకుడు ఇచ్చే సమాచారంతో కమిటీ సంతృప్తి చెందితేనే, జగన్ వరకూ విషయం వెళ్తుందట. అయితే, కమిటీ క్లియరెన్స్ ఇచ్చినా… తుది నిర్ణయం జగన్ దే. కొత్తగా చేరే నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలా వద్దా, పార్టీలో ఏ స్థాయి బాధ్యతలు కట్టబెట్టాలనే నిర్ణయాల్నీ చివరిగా జగనే తీసుకుంటారు.
గత ఎన్నికల్లో, పోలింగ్ తేదీ దగ్గరకి వచ్చేసరికి… నేతల్లో గెలుపు ధీమా ఎక్కువైపోయిందనీ, ఓటర్లను ఆర్థికంగా ఆకర్షించడంతో స్థానిక నేతలు విఫలం చెందారనే అభిప్రాయం ఆ పార్టీలో ఎప్పట్నుంచో ఉంది. కాబట్టి, గతానుభవం దృష్టిలో పెట్టుకుని… ఇప్పట్నుంచే జాగ్రత్త పడుతున్నట్టుగా ఉన్నారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే… పార్టీలో చేర్చుకోబోయే నేతల ఆర్థిక స్థితిగతులపైనే వైకాపా దృష్టి ఎక్కువగా ఉన్నట్టుంది. అంటే, ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కొనేందుకు వైకాపా సిద్ధపడుతోందో అనేది అర్థమౌతూనే ఉంది! వైకాపా అభ్యర్థులకు లభించే ప్రజాదరణలో… ఆర్థిక అంశాలే బలమైన పాత్ర వహించబోతున్నాయని వైకాపా అంచనా వేసుకుంటున్నట్టుగా ఉంది.