రాహుల్ గాంధీ అనర్హతపై దేశం గగ్గోలు పెడుతుంది. రాహుల్ గాంధీనే వదల్లేదంటే ఇక ప్రతిపక్ష నేతలు మిగలరని.. నియంతృత్వం వచ్చేసినట్లేనని బీజేపీయేతర పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రజా ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి. కానీ ఏపీ రాజకీయ పార్టీలు మాత్రం పూర్తిగా అసలు ఈ అంశంపై తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కనీస స్పందన వ్యక్తం చేయలేదు. ఆయా పార్టీలు పూర్తిగా జాతీయ అంశాలు ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకించే అంశాలపై దృష్టి పెట్టాయి.
కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ బీజేపీకి ఉంది. ఇందులో వైసీపీకి బీజేపీ సపోర్ట్ నిన్నామొన్నటి వరకూ ఉంది. దానికి కారణం టీడీపీ. … బీజీపీని వ్యతిరేకించడమే. కానీ ఇప్పుడు టీడీపీ కూడా బీజేపీని వ్యతిరేకించడం లేదు. దీంతో రాజకీయంగా బీజేపీ కూడా .. టీడీపీని టార్గెట్ చేయడం లేదు. అనవసరంగా బీజేపీపై ఎదురుదాడి చేసి… ఆ పార్టీ మరో పార్టీకి అనుకూలం అయ్యేలా చేయకూడదని రెండు పార్టీలు డిసైడయ్యాయి. అందుకే స్పందించడం మానేశారు.
అయితే వైసీపీ క్యాడర్ మాత్రం సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి బాగా జరిగిందని సంకలు గుద్దుకుంటున్నారు. ఎందుకంటే జగన్ ను అన్యాయం చేశారట. కేసుల్లో ఇరికించారట. అసలు కాంగ్రెస్ కు అన్యాయం చేసిందే జగన్ కదా అని ఇతరులు అంటే వారి దగ్గర సౌండ్ ఉండదు. ఇక టీడీపీ క్యాడర్ మాత్రం మోదీ నియంతృత్వ తీరును ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీపై అనర్హతా వేటుపై తమ అభిప్రాయాలను బలంగానే చెబుతున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం తలపడుతున్నాయి. ఇలాంటి సమయంలో జాతీయ అంశాల్లో తలదూర్చి… వేరే పార్టీకి అడ్వాంటేజ్ ఇవ్వాలని రెండూ పార్టీలూ అనుకోవడం లేదు.