కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తర్వాత అత్యధికంగా విరాళాలు పొందుతోందని తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలే. అధికారంగా ఆ పార్టీలు ఈసీకి అందించిన వివరాల ప్రకారం… బీఆర్ఎస్, వైసీపీ వందల కోట్లకు పడగలెత్తాయి. బీఆర్ఎస్కు 2021-2022 మధ్యకాలంలో రూ.218.11 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.153 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చారు. అంతకు ముందు ఈ మార్గాల్లో పైసా కూడా ఎవరూ ఇవ్వలేదు. పార్టీ ఆస్తుల విలువ ఏడాదిలో రూ.288 కోట్ల నుంచి రూ.480 కోట్లకు చేరినట్లుగా చెప్పింది. ఆదాయం కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు మరో రూ.451 కోట్లు ఉన్నట్లుగా చెప్పింది. ఇది కూడా ఏడాదిలో రూ. 200 కోట్లు పెరిగాయి. అంటే బీఆర్ఎస్కు రూ. వెయ్యి కోట్లకుపైగానే ఆస్తులు ఉన్నాయి.
ఇక వైసీపీ కి టీఆర్ఎస్ రేంజ్ లో కాదు కానీ.. వంద కోట్లకు కాస్త తక్కువగా వచ్చాయి. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.93.72 కోట్ల ఆదాయం వచ్చింది. ఎలెక్టోరల్ బాండ్ల రూపంలో రూ.60 కోట్లు, ఎలెక్టోరల్ ట్రస్టుల నుంచి రూ.20 కోట్లు వచ్చాయి. విచిత్రం ఏమిటంటే ఈ పార్టీ అసలు ఖర్చు పెట్టదు. రోజువారీ వ్యవహారాలు ఎలా నడుస్తాయో తెలియదు కానీ.. ఖర్చులుపోగా పార్టీకి నికరంగా రూ.92.72 కోట్ల ఆదాయం మిగిలిందని ఈసీకి లెక్కలు చెప్పింది. అంటే.. కనీసం ఏడాది పాటు కోటి కూడా ఖర్చు పెట్టకుండా పార్టీ నడిపేశారన్నమాట. వైసీపీకి బ్యాంకుల్లో రూ.343 కోట్ల నగదు ఉంది.
దేశంలో చాలా పార్టీలకు విరాళాలు అందడం గగనమైపోతోంది.కానీ అధికార పార్టీలకు మాత్రం పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. దేశంలో రాజకీయ పార్టీలకు కార్పొరేట్లు ఇచ్చే విరాళాల్లో అత్యధికం బీజేపీకే వెళ్తాయి. అతి కొద్దిగా ఇతర పార్టీలకు ఇస్తూంటారు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఈ విషయంలో బీజేపీని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఎలక్టోరల్ బాండ్లు, ఎలక్టోరల్ ట్రస్టుల విధానం తేవడంతో… ఇష్టారాజ్యంగా బ్లాక్ మనీని పార్టీలకు విరాళాలుగా తరలిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.