ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 23 పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. దాదాపు 7 వేల మంది ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఏపీ నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో అభిమానులు, రాష్ట్ర అధికారులు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. దీంతో విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధన అంశం మరోసారి ప్రముఖంగా మారింది. ఓపక్క ఏపీలో ప్రధాని మోడీ సభ నిర్వహించడం, రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి విమర్శలు చేయడం… ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం వెర్సెస్ రాష్ట్ర టీడీపీ సర్కారు పోరాటం మాత్రమే బాగా ఫోకస్ అవుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ తరుణంలో ప్రజల ఫోకస్ అంతా కేంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరువైపే మళ్లుతోంది. దీంతో ప్రతిపక్ష పార్టీ వైకాపా కొంత సందిగ్ధంలో పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమయంలో వారి పాత్ర ఏంటనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా స్పందించాలో వారికి అర్థం కావడం లేదనడంలో సందేహం లేదు. ప్రత్యేక హోదా హామీని ఢిల్లీ స్థాయిలో టీడీపీ హోరెత్తిస్తోన్న తరుణంలో… జగన్ స్పందన ఏంటి..? ఇప్పటికి కూడా ఏపీని ఆదుకోని మోడీ సర్కారుపై ధైర్యంగా విమర్శలు చేయలేకపోతున్నారు. ఇప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలకే పరిమితం అవుతున్నారు. ఈ విమర్శలకు కాలం చెల్లిపోయిందనీ, ప్రజలు హర్షించడం లేదన్నది వాస్తవం! సరే, ఇప్పుడు కూడా ఏపీ హక్కుల సాధన కోసమే పోరాడుతున్నామని తూతూ మంత్రంగా వైకాపా చెప్పుకోవడం కాదు, కేంద్రంపై ధైర్యంగా తిరుగుబావుటా ఎగరెయ్యాలి. అయితే, అలాంటి సంకేతాలు వైకాపా నుంచి రావట్లేదు. ఇప్పుడు కూడా ఏదో సందు వెతుక్కుని… టీడీపీ సర్కారుపై విమర్శలకే చూస్తోంది!
వాస్తవానికి, ఏపీ ప్రయోజనాల కోసం ఇదిగో ఫలానా రీతిగా పోరాడామని చెప్పుకునే సందర్భాలు వైకాపా దగ్గర లేవు. దీంతో… ఎప్పుడో గతంలో చేసిన నిరసనల్ని తమ వీరగాథలు వైకాపా ప్రజలకు బాకా ఊదే ప్రయత్నం చేస్తోంది. హోదా కోసం మా ఎంపీలు రాజీనామాలు చెయ్యలేదా, గుంటూరులో జగన్ దీక్ష చెయ్యలేదా, విశాఖ దీక్షకు జగన్ వస్తుంటే విమానాశ్రయంలో అడ్డుకోలేదా…. ఇలా, తాజా పరిణామాల నేపథ్యంలో వైకాపా నేతలు చెబుతున్నవి ఇవే! కర్ర విరగకుండా పాము చావకుండా వైకాపా చేసిన ఏపీ హక్కుల సాధన ప్రయత్నాన్ని ‘పోరాటం’ అని వైకాపా అనుకుంటోంది. అదేదో ‘ఉద్యమం’గా ప్రజలకు గుర్తుకు రావడం లేదు. ఈ క్షణానికీ రాష్ట్ర ప్రయోజనాలే వారి ప్రధాన అజెండా అనుకుంటే… భాజపాపై దేశమంతా నిరసన గళమెత్తుతున్నా, ‘మేం చాలా చేసేశాం’ అని చేతులు దులుపుకునేట్టు చెప్పుకునే ప్రయత్నం వైకాపా చెయ్యకూడదు. తెగించి ముందుకొచ్చి కేంద్రంపై పోరాడాలి. కనీసం అప్పుడైనా ఏపీ ప్రయోజనాల సాధన పోరాటంలో వైకాపా పాత్ర ఏంటనేది కొంతైనా ప్రజలకు స్పష్టమౌతుంది.