తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయా.. లేవా అన్నట్లుగా ఉన్నాయి. టీడీపీలోనే వాటి గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. కానీ.. వైసీపీ నేతలు.. ఆ పార్టీ సోషల్ మీడియా టీం మాత్రం.. పెద్ద ఎత్తున ఏపీ టీడీపీ అధ్యక్షుడి గురించి చర్చ పెడుతోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎంపీ రామ్మోహన్ నాయుడును.. చంద్రబాబు ఖరారు చేశారని వైసీపీలోని వర్గం సోషల్ మీడియాలో ప్రచారం లేవనెత్తింది. మరో వర్గం.. దానిపై లోకేష్ ఫైరయ్యారని… పార్టీలో ఇలా రెండు వర్గాలు ప్రారంభమయ్యాయని పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఈ పోస్టులూ అటూ ఇటూ తిరిగి లోకేష్ వద్దకే వెళ్లాయి. ఆయన ఐదు రూపాయల పేటీఎం బ్యాచ్ కష్టాలంటూ.. తనదైన శైలిలో ఖండించారు.
అయితే.. అసలు ఏపీ టీడీపీకి ఎవరు అధ్యక్షుడిగా ఉంటారో… వైసీపీ నేతలకు ఎందుకు.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇంకా.. విజయసాయిరెడ్డికి ఎందుకు అంత ఆసక్తి అనేది.. కొంత మందికి సీక్రెట్‌గా మారింది. అయితే.. టీడీపీలో ఓ రకమైన అంతర్గత వివాదం సృష్టించే లక్ష్యంతోనే వైసీపీ ఈ ప్రచారం ప్రారంభించిందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన పదవి కాలం ముగిసింది. కొత్తగా బీసీ యువకుడికి ఇవ్వాలన్న చర్చ.. కొంత కాలంగా ఆ పార్టీలో నడుస్తోంది. సహజంగానే మంచి టాకింగ్ పవర్ ఉన్న రామ్మోహన్ నాయుడుకి కీలక బాధ్యతలు ఇవ్వాలన్న సూచనలు పార్టీ హైకమాండ్‌కు వెళ్లాయి. ఎలాగూ.., బీసీ నేతనే ఏపీ టీడీపీ అధ్యక్షుడిని చేస్తారు. అది రామ్మోహన్ నాయుడే కావొచ్చు లేదా.. మరో సీనియర్ నేతయినా కావొచ్చని చెబుతున్నారు.
ఈ లోపు ఆ పదవి కోసం.. లోకేష్ రేసులో ఉన్నారని.. ఆయన అసంతృప్తికి గురయ్యారని.. ప్రచారం చేయడానికే.. వైసీపీ నేతలు ఈ వ్యూహం పన్నారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే.. వైసీపీ ప్రచారాన్ని లైట్ తీసుకుంటున్నాయి. టీడీపీ అంతర్గత వ్యవహాల గురించి.. ట్వీట్ చేసే ముందు.. వైసీపీలో ఏం జరుగుతుందో చూసుకోవాలంటూ… ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల వీడియోలను టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి రాజకీయం కొత్త పుంతలు తొక్కుతుందనుకోవచ్చు.