వేసవిలో మంచినీటి కొరతపై.. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు.. మూడురోజుల కిందట సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత పోలవరం, సీఆర్డీఏపైనా సమీక్ష చేశారు. ఇలా చేయడం.. నిబంధనలకు విరుద్ధమంటూ.. వైసీపీ ఫిర్యాదు చేయడం ఆలస్యం.. ఈసీ కూడా నోటీసులు జారీ చేసినంత ఉత్సాహం చూపించింది. అసలు ఏం చేయాలో.. ఏం చేయకూడదో అంటూ.. ఓ జాబితా పంపింది. ఇందులో.. చంద్రబాబు సెక్రటేరియట్‌కు వెళ్లవచ్చు కానీ.. సమీక్షలు చేయకూడదన్నట్లుగా చెప్పుకొచ్చారు. దాంతో.. చంద్రబాబు కూడా సైలెంట్ కావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులు చూస్తే.. చంద్రబాబు ట్రాప్‌లో.. వైసీపీ పడిందనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.
ఇది వేసవి కాలం. వర్షాభావం రీత్యా…. నీటి కొరత రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా అన్ని ప్రాంతాలకు.. మంచినీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఈ పనిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. ఉంటే తప్ప.. అధికార యంత్రాంగం.. చురుగ్గా ఉండదు. లేకపోతే పట్టించుకోవడం కష్టం. పైగా.. నీటి వనరుల లభ్యత కూడా తక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో.. చంద్రబాబు అసలు ఏమీ పని చేయకూడదన్నట్లుగా.. వైసీపీ ఫిర్యాదులు చేయడం.. దానికి తగ్గట్లుగా.. ఈసీ వ్యవహారశైలి ఉండటంతో… ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. అధికారయంత్రాంగం లైట్ తీసుకుంటోంది. సీఎం లేకుండా… ఇతర అధికారులు పర్యవేక్షిస్తే.. పనులు జరగవు. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఏపీలో చాలా చోట్ల .. మంచినీటి సౌకర్యం కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే.. మూడురోజులుగా… అకాల వర్షాలు ఏపీలోని పలు ప్రాంతాల్లో దడ పుట్టించాయి. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ముఖ్యంగా ఉద్యానపంటల రైతులు మరింత నష్టపోయారు. మమూలుగా అయితే.. ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు.. పంట నష్టాన్ని అంచనా వేసి .. ఉన్న పళంగా.. నష్టపరిహారం అందించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ రైతుల్ని పట్టించుకునేవారు లేరు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేకపోతే.. మంత్రులు వెంట పడకపోతే.. అధికారులు కదలరు. ఆ విషయం అందరికీ తెలుసు. అందుకే.. ఇప్పుడు.. ఏపీలో ఏం జరిగినా… అధికారులు పట్టించుకోవడం లేదు.
పరిస్థితులు రాను రాను.. మరింత.. క్లిష్టంగా మారనున్నాయి. నీటి ఎద్దడితో పాటు.. ఇతర సమస్యలు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రజలను ఆదుకోకపోతే.. ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మామూలుగా అయితే… ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం ఉంటుంది. కానీ చంద్రబాబు పని చేస్తానన్నా.. చేయనివ్వకుండా… అర్థం లేని కోడ్‌తో… ఆయనను నియంత్రించారని ప్రజల్లోకి వెళ్లిపోయింది. దీనంతటికి కారణం వైసీపీ అని.. వైసీపీ చెప్పినట్లు.. ఈసీ చేస్తుందన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఇప్పుడు ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా.. తను ఆదుకునేందుకు సిద్ధమైనా.. నిబంధనల పేరుతో అడ్డుకున్నారన్న విషయం ప్రాక్టికల్‌గానే ప్రజల ముందు ఉంచారు టీడీపీ నేతలు.