ఆంధ్రప్రదేశ్లో జరగనున్న పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రధాన రాజకీయ పార్టీలు నిర్ణయించుకున్నాయి. వైసీపీ ముందు నుంచి ఈ ఎన్నికలపై ఆసక్తి చూపలేదు. టీడీపీ నేతలు మాత్రం… కొంత ఆసక్తి చూపారు. టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలని టీడీపీ అనుకోలేదు. కానీ.. కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల నుంచి రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయాలని.. టీడీపీ నేతలు ఉత్సాహం చూపించారు. పెద్ద ఎత్తున ఓటర్లను చేర్పించారు. పోటీకి సిద్ధమని.. అధినేతకు.. నివేదికలు కూడా సమర్పించారు. కృష్ణాజిల్లా నుంచి సీనియర్ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, గుంటూరు జిల్లా నుంచి రాయపాటి శ్రీనివాసరావు పోటీకి సిద్ధమయ్యారు. అయితే.. పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు .. పార్టీ నేతలకు తెలిపారు.
గత ఎన్నికల్లో కృష్ణాజిల్లా నుంచి కృష్ణవేణి విద్యా సంస్థల అధినేత చిగురుపాటి వరప్రసాద్ టీడీపీ తరపున పోటీ చేశారు. ఆయనపై పీడీఎఫ్ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు విజయం సాధించారు. ఈ సారి కేఎస్ లక్ష్మణరావు పేరును ఖరారు చేశారు. లక్ష్మణరావు గతంలో కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా రెండుసార్లు గెలిచారు. వైసీపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అధికారికంగా ప్రకటించింది. జనసేన పార్టీ తరుపున అలాంటి ప్రయత్నాలేమీ కూడా ఇంత వరకూ జరగలేదు. అయితే.. పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండానే.. ఈ సారి పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫలితం తారుమారైతే.. మొత్తానికే మోసం వస్తుందన్న అంచనాలతో… రాజకీయ పార్టీలు.. ఎమ్మెల్సీ ఎన్నికలను లైట్ తీసుకున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్ల జాబితాలను.. ప్రతీ ఎన్నికలకు ముందు కొత్తగా ప్రిపేర్ చేస్తారు. దాని ప్రకారం.. ఎవరు ఎక్కువ మంది చేర్పిస్తే..వారికే విజయం లభిస్తుంది. పీడీఎఫ్ ఈ విషయంలో ముందు ఉంటుంది. ఈ సారి టీడీపీ నేతలు కూడా.. భారీగానే ఓటర్లను చేర్పించినప్పటికీ… ఫలితం తేడా వస్తే.. ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని.. వెనుకడుగు వేసిటన్లు తెలుస్తోంది.