తిరుపతిలో వైసీపీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించిన తర్వాత.. రాష్ట్ర ప్రజల్లో ఓ అభిప్రాయం బలపడుతోంది. వైసీపీ నేతలు చేస్తున్నది మూడు రాజధానుల ఉద్యమం కాదని.. మూడు రాష్ట్రాల ఉద్యమం అని భావిస్తున్నారు. ఈ బాధ అంతా ఎందుకు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రాంతీయ ఉద్యమాలతో .. సమయాన్ని .. ధనాన్ని పాడు చేసుకోవడం కంటే.. తెలంగాణ విడిపోయినట్లుగా విడిపోతే చాలా మంచిదన్న వాదన వినిపిస్తోంది. అధికార పార్టీనే ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నప్పుడు.. ఇక కలిసి ఉండాల్సిన అవసరం ఏమిటనేది ఎక్కువ మంది భావన.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను.. విభజిత ఏపీని పరిపాలిస్తోంది సీమ ముఖ్యమంత్రులే. సీమ పేరుతో ఉద్యమాలు చేస్తున్న వాళ్లు ఆ ప్రాంతానికి ఏం చేశారో చెప్పలేరు కానీ.. ఆత్మగౌరవయాత్రలు చేస్తూంటారు. ఈ పేరుతో.. కోస్తాంధ్రపై వారు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. విశాఖలోనూ అంతే. విజయవాడ సిటీ .. రాష్ట్రం మధ్యలో ఉంది కాబట్టి జంక్షన్‌గా అభివృద్ధి చెందింది. విజయవాడ కన్నా విశాఖ ఎన్నో రెట్లు అభివృద్ధి చెందింది. ఒక్క విజయవాడనే చూపించి కోస్తా అంతా అభివృద్ధి చెందిందని.. విశాఖ ఉన్న ఉత్తరాంధ్ర.. తిరుపతి ఉన్న సీమ అభివృద్ధి చెందలేదని వేర్పాటు ఉద్యమాలు చేయడం ఎందుకన్న వాదన వినిపిస్తోంది.
కోస్తా వాసులు కూడా ఈ వివక్షపై ఎక్కువ కాలం ఓపికతో ఉండే అవకాశం లేదు. రేపో మాపో వారు కూడా తమకు ప్రత్యక్ష ఆందోళనకు దిగే అవకాశం ఉంది. దీంతో మూడు రాష్ట్రాల ఉద్యమం ఊపందుకోనుంది. చీలిక పేలికలు అవడానికి రెడీగా ఉందని అనుకోవచ్చు. పరిపాలించమని ప్రజలు చాన్సిస్తే.. ఆ పని చేయకుండా.. చేతకాని పాలన చేసి మళ్లీ గెలవడానికి విభజన తప్ప మరో చాయిస్ లేదనే పాలకుల వల్ల ప్రజలకు మిగిలేది చివరికి విద్వేషాలే. ప్రజలకు ఇప్పుడు లభిస్తోంది అదే.