దళితులపై వరుసగా జరుగుతున్న దాడుల వ్యవహారం రోజు రోజుకు రాజకీయ దుమారంగా మారుతోంది. రాజకీయ పార్టీల కన్నా దళిత సంఘాలే ఎక్కువగా ఆందోళనలకు దిగుతున్నాయి. జరుగుతున్న ఘటనపై కఠినమైన చర్యలు తీసుకుంటే దళితులు సంతృప్తి చెందేవారు. కానీ కారణం ఏమిటో కానీ ప్రభుత్వం ప్రతీ అంశంలోనూ నిర్లక్ష్యం వవహిస్తూనే ఉంది. రాజమండ్రి శిరోముండనం ఘటనలో ఎస్ఐని సస్పెండ్ చేశారు కానీ.. అసలు కారణం అయిన వైసీపీ నేత జోలికి మాత్రం పోలేదు. శిరోముండనం బాధితుడు వరప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాయడం దగ్గర్నుంచి ఇప్పటికీ తన పోరాటం తాను చేస్తూనే ఉన్నారు. ఇక చీరాలలో దళిత యువకుడ్ని కొట్టి చంపిన పోలీసుల విషయంలోనూ అంతే తీరు. ఈ కేసు విషయంలో పోలీసులు అందరి నోళ్లు మూయించారు కానీ… విషయం హైకోర్టుకు చేరింది.
ఇక చిత్తూరు జిల్లాకు చెందిన దళిత జడ్జి రామకృష్ణ విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆయనను ట్రాప్ చేసి.. న్యాయవ్యవస్థపై బురద చల్లాలనే ప్రయత్నం కూడా చేశారు. చివరికి రివర్స్ అవడంతో రామకృష్ణను ఎన్ని విధాలుగా వేధించాలో అన్ని విధాలుగా వేధిస్తున్నారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి.. ఇలా బాధితులైన దళితులు అదే పనిగా న్యాయం కోసం గళమెత్తుతున్నా… ఎలాంటి చలనం పోలీసుల్లో ఉండటం లేదు. వారి కేసులకు లేని పోని ప్రాధాన్యం ఇస్తే విషయం పెద్దది అవుతుందని వైసీపీ పెద్దలు భావించారేమో కానీ… అసలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో… దళితుల పోరాటం అంతకంతకూ పెరుగుతూ ఉంది. జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి ఘటనతో దళిత సంఘాలన్నీ చలో మదనపల్లికి పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు.. పోలీసుల కట్టడి మొత్తంగా దళితుల ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీయకపోగా మరింత ధైర్యాన్నిచ్చింది.
తమ పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని.. రామకృష్ణతో పాటు.. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తన్న లాయర్ శ్రవణ్ కుమార్ చెబుతున్నారు. మరో వైపు ఈ ఘటనలు… దళితులపై సాగుతున్న అణిచివేత గ్రామాల్లో వైసీపీ నేతల ఆధిపత్యం వెరసి.. దళితులకు ఈ ప్రభుత్వం తమది కాదనే భావనకు వచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని వైసీపీ హైకమాండ్‌కు తెలియక కాదు. అంతా తెలిసే ఉంటుంది… కానీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నా.. ఓటింగ్ సమయానికి వారు వైసీపీకే ఓటు వేస్తారని… టీడీపీకీ కానీ మరే ఇతర పార్టీకి కానీ వేయరని వైసీపీ పెద్దలు భావిస్తూండటం వల్ల.. ఇలా లైట్ తీసుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది.