తూ.గో జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరిస్తూ… కొత్త వారికి చాన్సిస్తూ జాబితా రెడీ అయినా దాన్ని రిలీజ్ చేయలేకపోయారు వైసీపీ పెద్దలు. క్రిస్మిస్ తర్వాత రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీనికి కారణం .. లీడర్లు, క్యాడర్ మూకుమ్మడిగా జనసేనలో చేరిపోతారని భయమే. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇప్పటికే జనసేనతో చర్చలు ప్రారంభించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, జగ్గంపేట, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, సిటీ సహా మొత్తం పది నియెజకవర్గాల్లో పార్టీల ఇంచార్జిల మార్పు అనివార్యం అన్న సంకేతాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలా స్పష్టంగా వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన తమని కాదని.. ముద్రగడ పద్మనాభంకు పిలిచి మరీ పీట వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల నేతలు రగిలిపోతున్నారు. సీటు పేరుతో మంత్రి విశ్వరూప్ కుటుంబంలో జగన్ చిచ్చు పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి.
అసలు ఎమ్మెల్యేల సంగతి అలా ఉంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు విషయంలోనూ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయం కూడా మింగుడు పడడం లేదు. ఆయన్ను అమలాపురం పార్లమెంటుకు పోటీచేయాలని ఇప్పటికే సూచించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అసలు ఆయనకు పార్లమెంట్ సీటు కూడా ఉండదని పక్కన పెట్టేస్తున్నారని అంటున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆయనకు మూడు వందల ఓట్లు మాత్రమే వస్తాయని గతంలోనే తేలింది.