ఆంధ్రప్రదేశ్ మంత్రులకు పని ఉండదు. వారి పని అంతా సకల శాఖ మంత్రి చేస్తారు. మంత్రులు మాత్రం వారి పనులు వారు చక్కగా చేసుకుంటున్నారు. ఆ పనులేమిటంటే.. .అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా దోపిడికి పాల్పడటం. మంత్రులే కాదు కొంత మంది ఎమ్మెల్యేలు కూడా చెలరేగిపోతున్నారు.
తమ జిల్లాల్లో ఎక్కడ దోచుకోవడానికి భూములు అనుకూలంగా ఉంటేవాటిని దోచేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములకు ఓ స్టైల్.. ప్రైవేటు భూములు మరొక స్టైల్ అనుసరిస్తున్నారు. ఇప్పటి వరకూ ముగ్గురు మంత్రుల బాగోతాలు ఆధారాలతో సహా బయటకు వచ్చాయి.
గుమ్మనూరు జయరాం భూదందా మామూలుగా లేదు !
మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన దందా గురించి ఆదాయపు పన్ను శాఖకూ తెలిసిపోయింది. పరిశ్రమ కోసం సేకరించిన భూముల్ని.. ఆయన ప్రైవేటు సంస్థ యాజమాన్యాన్నిబెదిరిచి తన కుటుంబం పేరు మీద బదలాయించుకున్నారు. ఈ అంశం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరిశ్రమ పెట్టి భూములు ఇచ్చిన వారికి ఉద్యోగాలిస్తామన్న హమీ మీద వాటిని తీసుకున్నారు. ఉద్యోగాలివ్వలేదు. తాము అధికారంలోకి వస్తే ఆ భూములన్నీ రైతులకు ఇప్పిస్తానని చెప్పి ఓట్లేయించుకున్న గుమ్మనూరు జయరాం.. అధికారంలోకి రాగానే ఆ భూములన్నింటినీ తన పేరు మీద రాయించుకున్నారు. ఇప్పుడు ఆదాయపు పన్నుశాఖ డాక్యుమెంట్లో చూపించిన డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని ఆరా తీస్తోంది. వాస్తవానికి ఆ భూముల విలువ వదల కోట్లు ఉంటుంది.
ఉషాశ్రీచరణ్ ఒత్తిళ్లకు చేతులెత్తేసిన సుజ్లాన్ సంస్థ
పవన్ విద్యుత్ సంస్థల్లో సుజ్లాన్ చాలా మంచి సంస్థ. కానీ ఈ సంస్థ అనంతపురం జిల్లాలో సేకరించిన భూముల్ని భయపెట్టి అతి తక్కువ ధరకు మంత్రి ఉషా శ్రీచరణ్ కొట్టేశారు. అధికారం అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడటంతో ఈ భూములు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సుజ్లాన్ చైర్మన్ చనిపోయారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడీ భూముల వ్యవహారం సంచలనం అవుతోంది. ప్రస్తుతం అక్కడ మంత్రి ఫ్యామిలీ రిసార్ట్ కడుతోంది.
ధర్మవరం కేతిరెడ్డి.. మామూలు కబ్జాలు కావు !
గుడ్‌మార్నింగ్ స్టార్‌గా పేరు పొందిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే. పెద్ద ఫ్యాక్షన్ లీడర్నని అందర్నీ భయపెట్టి… ఉదయమే కెమెరాలతో రోడ్లపై తిరిగే ఈయన .. చేసిన కబ్జాల గురించి దర్మవరం అంతా కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇటీవల ఓ ప్రైవేటు కంపెనీ యజమానుల్ని అధికారుల సాయంతో బెదిరించి అతి తక్కువ ధరకు వంద ఎకరాలకుపైగా కొట్టేసిన వైనం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రశ్నిస్తే ప్రైవేటు భూమి కంటే తప్పేంటి అని ఆయన ఎదురుదాడికి దిగారు. బెదిరించి ప్రైవేటు ఆస్తుల్ని లాక్కోవడం కరెక్ట అన్నట్లుగా మాట్లాడారు.
ఇలా వైసీపీ నేతల భూదందాలు వరుసగా బయటకు వస్తున్నాయి. ఆ భూములు పరిశ్రమ కోసం సేకరించినప్పుడు రైతులకు ఏం చెప్పారో అవి నేరవెరలేదు. కానీ మెల్లగా అవి వైసీపీ నేతల పేరు మీదకు మారిపోతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం… మావాళ్లింతే అన్నట్లుగా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతోంది. ఇలా బయటపడిన వారు కొంత మందే.. ఇంకా ఎంత మంది ఉన్నారన్నది బయటకు రావాల్సి ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం.. ఏపీలో .. ఏ ఒక్క ప్రైవేటు ఆస్తికీ గ్యారంటీ లేకుండా పోయింది.