ఆంధ్రప్రదేశ్ పోలీసులపై… వైసీపీ నేతలు ఓ రకంగా పగబట్టినట్లే కనిపిస్తున్నారు. సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి…ఏపీ పోలీసులపై నమ్మకం లేదని ప్రకటించి.. కులం ముద్ర వేయడం దగ్గర్నుంచి.. ఇప్పుడు.. నేరుగా ఏపీ డీజీపీపై… హైకోర్టులో .. సంబంధం లేని అంశంపై పిటిషన్ వేసి.. దానికి తన మీడియాలో విస్తృత ప్రచారం కల్పించడం వరకూ.. అన్ని పోలీసుల్ని టార్గెట్ చేసుకుని నడిపిస్తున్నారు. వైసీపీ తరపున హైకోర్టులో పిటిషన్లు వేసే బాధ్యతలు నిర్వహిస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి… తాజాగా మరో పిటిషన్ వేశారు. ఈ సారి ఏపీ డీజీపీ రామ్ ప్రవేశ్ ఠాకూర్‌పైనే ఆ పిటిషన్ వేశారు. విషయం ఏమిటంటే.. హైదరాబాద్‌లోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్న… ఆర్పీ ఠాకూర్ ఇంటి నిర్మాణం అక్రమంగా ఉందట. ఒకటో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు వెళ్లడానికి.. ఓ బ్రిడ్జిలాంటిది నిర్మించారట. అంతే కాకుండా.. ఆయన ఇంటి పక్కన ఉన్న పార్కును కూడా ఆక్రమించారట. దీనిపై.. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా.. ఎవరూ పట్టించుకోలేదట.
అసలు హైదరాబాద్‌లోని ఆర్పీ ఠాకూర్ ఇంటికి… ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏంటి సంబంధం ..? కనీసం అది ఒక రాష్ట్రం కూడా కాదు. మరి ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చింది…? అంటే.. కచ్చితంగా.. ఎన్నికల ముందు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు వైసీపీ చేస్తున్న వ్యూహాత్మక చర్యల్లో ఇది ఒకటన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. మొదటగా.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని… వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి.. ఏపీ పోలీసులు అంటే..అందరూ.. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారేనని ప్రచారం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి సభ దగ్గర ఎవరో రైతు ఆత్మహత్య చేసుకుంటే.. కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులపై… వాళ్లే కొట్టి చంపారనే నిందలు వేశారు. ఇప్పుడు డీజీపీపైనే పిటిషన్లు వేస్తున్నారు. తమపై కావాలనే.. విషప్రచారం చేస్తున్నారని.. ఎస్పీ స్థాయి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు.
ఆర్పీ ఠాకూర్ పై ఇంటిపై ఆళ్ల వేసిన పిటిషన్‌ను చూసి.. సివిల్ సర్వీస్ అధికారులు కూడా నవ్వుకుంటున్నారు. ప్రశాసన్ నగర్ అనేది.. అప్పట్లో ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన కాలనీ. అందరూ.. సివిల్ సర్వీస్ అధికారులే ఉంటారు. ఎవరూ ఎవర్నీ అడగరు. ప్రశాసన్ నగర్లో ఒక్క ఇల్లు కూడా.. నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని ఎవరూ అనుకోరు. అయినా కూడా ఆళ్ల… ఈ అంశం పట్టుకుని పిటిషన్ వేశారు. దీని వెనుక కేవలం ఏపీ డీజీపీని బ్లాక్మెయిల్ంగ్ చేసే ఉద్దేశం తప్ప మరొకటి లేదని.. రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.