డ్వాక్రా మహిళలకు రూ. 10,000 చొప్పున ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడు దశల్లో సొమ్ము ఇచ్చేందుకు చెక్కుల పంపిణీకి కూడా ప్రభుత్వం సిద్ధమౌతోంది. అయితే, ఈ కార్యక్రమంపై బురద చల్లేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఓపక్క వారి పత్రికలో ఈ పథకంపై రకరకాల అనుమానాలు రేకెత్తించేలా చేస్తూ కథనాలను వండి వారుస్తూ, మరోపక్క మహిళలతో వైకాపా నేతలు సభలూ సమావేశాలు ఏర్పాటు చేసి… వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే రోజా తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభకి కేవలం మహిళలను మాత్రమే వైకాపా శ్రేణులు తీసుకొచ్చాయి.
పసుపు కుంకుమ పేరుతో మహిళలకు ఎరవేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారంటూ రోజా ఆరోపించారు. ఏ ముఖ్యమంత్రీ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వరనీ, ఆ చెక్కులు మారాలంటే తాను మరోసారి అధికారంలోకి రావాలంటూ మహిళలను మభ్యపెట్టాలన్నదే సీఎం కుట్ర అని ఆమె విమర్శించారు. నిజమైన అన్న అంటే ఏంటో వైయస్ జగన్ ని చూస్తే అందరికీ తెలుస్తుందని రోజా చెప్పారు! ప్రజలందరి అభ్యున్నతి కోసం ఆయన నవరత్నాలను రూపొందించారనీ, మహిళల కోసం ఏడు పథకాలు పెట్టారని రోజా అన్నారు. జగనన్నను ముఖ్యమంత్రి చేయడం ద్వారానే మహిళలకు న్యాయం జరుగుతుందని రోజా తీర్మానించేశారు! చంద్రబాబు నాయుడు అవుట్ డేటెడ్ సీఎం అనీ, జగన్ అప్ కమింగ్ సీఎం అనీ ఆమె అన్నారు.
పెన్షన్లను రెండింతలు చేయడం, పసుపు కుంకుమ పథకం ప్రకటించడం… ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు వైకాపాకి కునుకు లేకుండా చేస్తున్న సంగతి అర్థమౌతూనే ఉంది. ఓపక్క టీడీపీ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుంటే, ఎప్పుడో జగన్ ముఖ్యమంత్రి అయితే ఏదో చేస్తారని రోజా అంటుంటే… ఎవరైనా ఎందుకు నమ్ముతారు..? నిజమైన అన్న జగన్ అన్న అంటే ఎలా..? దానికో వివరణ కావాలి కదా. మహిళల అభ్యున్నతి కోసం ఏడు పథకాలు జగన్ ప్లాన్ చేశారని రోజా అనడం మరీ హాస్యాస్పదం! అరే… ఓపక్క చంద్రబాబు సర్కారు పథకాలను అమలు చేస్తుంటే, ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏదో ప్లాన్ చేసుకున్నారంటే ఎలా సరిపోతుంది..? మహిళా లోకం చంద్రబాబును క్షమించదు, ఇది మోసం, ఇది దగా, ఇది కుట్ర… అంటూ వ్యాఖ్యానాలు చేస్తూ పోతుంటే, మహిళలా లోకంలో వైకాపా మీదున్న కాస్తోకూస్తో అభిమానం కూడా పోతుంది. తమకు లబ్ధి చేకూర్చే పథకాలను చంద్రబాబు అమలు చేస్తుంటే… కంటగింపుతో వైకాపా నేతలు మాట్లాడుతున్నారని మహిళా లోకానికి అర్థం కాకుండా ఉంటుందా..?