వైయస్సార్సీపి సిట్టింగ్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి జగన్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ ఏర్పడిన తొలినాళ్ళ నుంచి జగన్ కి అండగా ఉంటూ వస్తున్న ఒంగోలు సిట్టింగ్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈసారి కూడా అదే స్థానం నుంచి టిక్కెట్ ఆశించారు. అయితే జగన్ సుబ్బారెడ్డి షాక్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ నుండి ఆఖరి నిమిషంలో వైఎస్ఆర్సిపిలో చేరిన మాగుంట కు టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే దీంతో అలకబూనిన వైవీ సుబ్బారెడ్డి కి జగన్ రాజ్యసభ టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, సుబ్బారెడ్డి అలక వీడలేదని సమాచారం. ఒకవేళ మాగుంట పార్టీలో చేరిన ఎమ్మెల్యే టికెట్ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తారు తప్పించి ఎంపీ టికెట్ ఇవ్వమని, ఎంపీ టిక్కెట్‌కు తానే ఉంటానని గతంలో సుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ చేసినప్పటికీ, మీడియా ముఖంగా తన అభిప్రాయాన్ని తెలిపినప్పటికీ, జగన్ దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా మాగుంటను ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేయించడం పై గుర్రుగా ఉన్న సుబ్బారెడ్డి ప్రచార కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఏదో మొక్కుబడిగా పాల్గొంటున్న సుబ్బారెడ్డి, జగన్ కొత్త ఇంటి ప్రారంభోత్సవంలో పాల్గొనకపోవడంతో ఆయన ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నారని అర్థం అవుతోంది. మరి ఇది ఒంగోలు పార్లమెంటు ఎన్నికలను ఏవిధంగా ప్రభావితం చేస్తుంది అన్నది వేచి చూడాలి.