తాను ఒకటి తలిస్తే తన పార్టీ నేతలు మరొకటి తలుస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. జిల్లాల ఏర్పాటు ప్రకటన తర్వాత అటు స్వాగతించలేక.. ఇటు వ్యతిరేకించలేక టీడీపీ ఇబ్బంది పడుతుందని అంచనా వేశారు. పరిస్థితి మొదట్లో అలాగే ఉంది. ఎన్టీఆర్ పేరును కూడా స్వాగతించలేదని వైసీపీ విమర్శలు చేసింది.కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్డెక్కిన వైసీపీ నేతలే కనిపిస్తున్నారు. ఓ చోట జిల్లా కేంద్రం మార్చాలంటారు..మరో చోట జిల్లా కావాలంటారు.. మరో చోట పేరు కావాలంటారు.. ఇలా ఏదో ఓ కారణంతో ప్రతీ చోటా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులుసైతం అన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తప్పించుకుంటున్నారు.
చాలా చోట్ల వైసీపీలోని వర్గాలే ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తూండటం ఆ పార్టీ అగ్రనేతల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప.గో జిల్లాలో నర్సాపురం పార్లమెంటరీ స్థానాన్ని జిల్లా చేస్తూ భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడంపై జిల్లా ఎమ్మెల్యేలు రెండుగా విడిపోయారు. వారు కలెక్టర్‌ను కూడా కలిశారు. వీరి తీరుతో ప్రజల్లోనూ చీలిక వస్తోంది. ఇక సీఎం సొంత జిల్లా కడపలో రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంపై జరుగుతున్న రగడ హెడ్ లైన్స్‌కు ఎక్కుతోంది. వైసీపీకి బై బై అని పోస్టర్లు వేసిన అంశం వైరల్ అయింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలన్నింటిలోనూ అదే పరస్థితి.
పార్టీ నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరాటం వల్ల వైసీపీ నేతలు రోడ్డు మీదకు వస్తున్నారని.. ప్రజలు ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు అంతర్గతంగా ఓ అంచనాకు వచ్చారు. వారందర్నీ కంట్రోల్ చేయాలంటే తలకు మించిన భారం అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం అయితే ప్రతిపక్షం వీటిని పరిశీలిస్తూనే ఉంది. కానీ వైసీపీ నేతలు మాత్రం రోడ్డెక్కారు. సొంత ప్రభుత్వానికి డిమాండ్లతో ఉక్కపోత పోయిస్తున్నారు. ఏదో ఓ డిమాండ్‌నే ప్రభుత్వం అంగీకరించగలదు.. మిగతా వారు నిరాశపడతారు. అది అంతిమంగా ఇబ్బందికరంగా మారుతుందని వైసీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.