ఒకవేళ అచ్చంగా ఆ పార్టీని ముంచే ఉద్దేశంతో వెళుతున్నప్పటికీ కూడా.. ఆ విషయాన్ని బహిరంగంగా ఎవరూ ఒప్పుకోరు. అయితే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన సస్పెండెడ్ ఎమ్మెల్యే రోజా తన వ్యాఖ్యలతో తెదేపాలోకి వెళ్తున్న వైకాపా వారి మీద కొత్త అనుమానాలు పుట్టే పరిస్థితిని కల్పిస్తున్నారు. ఈ ఫిరాయింపుల నేపథ్యంలో.. తనదైన శైలిలో చంద్రబాబు మీద విరుచుకుపడిన రోజా.. ఫిరాయిస్తున్న వారిని సహజంగానే తిట్టిపోశారు. అయితే ట్విస్టు ఏంటంటే.. ఇలా వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వలన తెలుగుదేశానికే నష్టం అని.. ఎంత ఎక్కువ మంది చేరితే ఆ పార్టీ అంత తొందరగా మునిగిపోతుందని రోజా అంటున్నారు.
తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో గానీ.. రోజా మాటలు వింటే మాత్రం.. తెలుగుదేశాన్ని ముంచడానికే వైకాపా ఎమ్మెల్యేలను వీళ్లే ట్రెయిన్ చేసి పంపుతున్నట్లుగా అనిపించినా ఆశ్చర్యం లేదు.
ఈ సందర్భంగా రోజా మాత్రం చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడుకు వయసు అయిపోయిందని.. ఆయనకు చూపు కూడా మసకబారిపోయిందని.. పార్టీ మీద పట్టు సన్నగిల్లిపోయిందని తన వైఫల్యాల మీదనుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే.. ఇలాంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని రోజా అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన వైకాపాకు వచ్చే నష్టం ఏమీ లేదని రోజా వ్యాఖ్యానించారు. వెళ్లిపోయిన వారు రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు సొంతంగా ఒక పార్టీ పెట్టి, ఒక సీటు అయినా సాధించగలరా అంటూ ఆమె డిమాండ్ చేయడం విశేషం. చంద్రబాబు, లోకేశ్ అవినీతి అంతా దోచుకుంటున్నారని, అవినీతిలో వారు డబుల్ డిజిట్ సాధించారని ఆమె దుయ్యబట్టారు. ఇన్ని నిందలు వేసినప్పటికీ.. వైకాపా నేతలు ఎంత ఎక్కువ మంది తెదేపాలోకి వెళితే అంత తొందరగా ఆ పార్టీ మునిగిపోతుందంటూ రోజా భవిష్య వాణి వినిపించడమే చిత్రమైన సంగతిగా ఉంది.