ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఎన్నికల ఫలితాల్లో స్పష్టమవుతోంది. మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో హడావుడి చేసి.. చివరికి వెండి బిస్కెట్లు కూడా పంపిణీ చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు గెలుపుబాటలో ఉన్నారు. మూడు రౌండ్లు ముగిసేసరికి ఆయన పది వేల ఓట్ల మెజార్టీకి దగ్గరగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో విజయాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద ఎత్తున నేతల్ని మోహరించింది. రాజధాని అంటూ రెచ్చగొట్టింది. కానీ అక్కడి ప్రజలు మాత్రం క్లారిటీగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా మాధవ్ పోటీ చేసి విజయం సాధించారు. అంతకు ముందు రెండు సార్లు పీడీఎఫ్ అభ్యర్థి గెలిచారు. ఈ సారి టీడీపీ అభ్యర్థికి ఊహించనంత మద్దతు లభించింది. ఇది ప్రభుత్వానికి ఓ స్పష్టమైన సంకేతంగా భావించవచ్చు.
ఇక గెలవమేమో అని దొంగ ఓట్ల విప్లవం సృష్టించిన తూర్పు రాయలసీమలోనూ వైసీపీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ భారీ ఆధిక్యంలో ఉన్నారు . ప్రతీ రౌండ్లోనూ ఆయన ఆధిక్యంలో ఉన్నారు. గతంలో ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థి గెలిచారు. కానీ ఈ సారి అధికారంలో ఉండి… ఎన్ని రకాల అక్రమాలు చేయాలో అన్నీ చేసినా ప్రయోజనం ఉండటం లేదు. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపు సునాయాసం అవనుంది.
అలాగే పశ్చిమ రాయలసీమ నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కంటే… వెయ్యి ఓట్లతో మాత్రమే వెనుకబడ్డారు. ఎవరికీ యాభై శాతం ఓట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి ద్వితీయ ప్రాధాన్య ఓట్లు కీలకం కానున్నాయి. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల విషయంలో పీడీఎఫ్ .. టీడీపీ పరస్పర సహకారం అందించుకున్నాయి. అదే కలిసి వస్తే.. ఈ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. అదే జరిగితే జగన్ ఇజ్జత్ పోయినట్లే. కడప లాంటి గుప్పిట పెట్టుకున్న జిల్లాలోనూ పట్టభద్రులు ఆగ్రహంగా ఉన్నట్లుగా తేలిపోతుంది.
ఎన్నికలకు ముందు కాస్త ఆలోచన పరులు అయిన పట్టభద్రులు వేసిన ఓట్లు ప్రభుత్వానికి బుద్ది చెప్పేలా ఉన్నాయి. ఈ ఫలితాల నుంచి ప్రభుత్వం ఏమైనా నేర్చుకుంటుందా లేకపోతే… డబ్బులు సరిగ్గా పంచలేదని.. దొంగఓట్లు సరిగ్గా వేయలేకపోయామని… కంచుకోటల్లో సరిగ్గా రిగ్గింగ్ చేయలేకపోయామని నిర్ణయించుకుని ఆ దిశగా మెరుగుపడేందకందుకు ప్రయత్నిస్తుందా అన్నది ఆ పార్టీ ఇష్టం కానీ ప్రజలు చూసే కోణంలోనే చూస్తున్నారని ఫలితాలు అర్థమవుతున్నాయి.