వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. పాదయాత్ర మొదలుకొని ఎన్నికల ప్రచార సభల వరకూ… జగన్ ఇంతవరకూ ఇస్తున్న హామీలనే మేనిఫెస్టోలో చేర్చారు. వైయస్సార్ కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని, పోలవరం యుద్ధ ప్రాతిపదిక పూర్తిచేస్తామని మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామనీ.. హోదా సాధనతో ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామన్నారు. ప్రతీ గ్రామంలో వాలంటీర్లను పెట్టి, ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ అయ్యేలా చేస్తామనీ, వీరికి రూ. 5 వేలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రతీయేటా కేలండర్ ను విడుదల చేస్తామన్నారు.
వైయస్సార్ ఆసరా కింద పొదుపు సంఘాల మహిళల రుణాలను వారి చేతికే నాలుగు దఫాల్లో ఇస్తామన్నారు జగన్. సున్నా వడ్డీ రుణాల విప్లవం తీసుకొస్తామన్నారు. మద్యపాన నిషేధం మూడు దశల్లో చేస్తామన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల్లో 13 లక్షల మందిని వెంటనే ఆదుకుంటామన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గర్భగుడి తలుపులను గొల్లలు తెరిచే సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తామన్నారు. చనిపోయిన ప్రతీ గొర్రెకు రూ. 6 వేలు బీమా అందిస్తామన్నారు. అమ్మఒడి, పెన్షన్ల పెంచు, ఫీజు రీఎంబర్స్ మెంట్, పేదలకు ఇళ్ల నిర్మాణం, వైయస్సార్ ఆరోగ్య శ్రీ, రైతులకు పెట్టుబడుల కోసం ప్రతీయేటా ఆర్థిక సాయం, బీసీలకు హామీలు… ఇవన్నీ ఉన్నాయి. పాదయాత్రలో, ఇప్పుడు ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో జగన్ ఏవైతే హామీలు ఇస్తూ వచ్చారో.. వాటినే మేనిఫెస్టోలో చేర్చారు.
ఈ సందర్భంగా గత ఎన్నికల్లో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో గురించి జగన్ చాలాసేపు మాట్లాడారు. మేనిఫెస్టో ప్రకటించాక, దాన్ని అమలు చేసి తీరాలనీ, అలా చెయ్యకుండా మరో మేనిఫెస్టో ఎలా ప్రకటిస్తారని విమర్శించారు. 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. ఇచ్చిన మేనిఫెస్టోకి కట్టుబడి ఉంటేనే విశ్వసనీయత ఉంటుందన్నారు. చివరికి… వైకాపా మేనిఫెస్టో విడుదలలో కూడా టీడీపీపై విమర్శలు లేకుండా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించలేకపోయారని అనిపిస్తుంది. ఇది వైకాపా నుంచి వచ్చిన రెండో మేనిఫెస్టో. గత ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మలేదు. కాబట్టి, ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజల విశ్వసనీయతను సాధించుకోవాల్సిన అవసరం వైకాపా ముందుంది.