సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై స్టే రాలేదు. సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్నట్లుగా ఫలానా తేదీలోపు కట్టివ్వాలన్న అన్న అంశంపైనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కానీ వైసీపీ నేతలు దాన్ని చిలువలు..పలువుగా చెప్పుకుంటున్నారు. స్టే అనే పదాన్ని చెప్పుకుంటూ.. మూాడు రాజధానులకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. విశాఖకు చెందిన మంత్రి అమర్నాథ్ మరో అడుగు ముందుకేశారు. ఏప్రిల్ నుంచి జగన్ విశాఖ నుంచే పాలన చేస్తారని చెప్పుకొచ్చారు.
ఇప్పటికైతే అమరావతే రాజధాని. సుప్రీంకోర్టులో స్టే రాలేదు. విచారణ పూర్తయ్యే వరకూ వస్తుందన్న గ్యారంటీ లేదు. కేంద్రం సహా అన్ని పక్షాలు తమ వాదనలు వినిపించాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. అప్పటి వరకూ రాజధానిని కదిలించడానికి అవకాశం లేదు. కానీ గుడివాడ అమర్నాథ్ మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ ముహుర్తం పెట్టేశారు. ఆయన రాజధాని అని చెప్పడం లేదు. జగన్ పాలన చేస్తారని చెబుతున్నారు. అంటే… కోర్టులో అనుకూల ఫలితం రాకపోయినా రుషికొండను తొలిచేసి కట్టుకుంటున్న ఇళ్లు పూర్తి కాగానే అక్కడికి మారిపోతారన్నమాట.
అదే సీఎం క్యాంపాఫీస్గా మార్చుకుని పాలన సాగిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అది చ్టట బద్ధం కాదు.. ఇంకా చెప్పాలంటే… ప్రజల్ని.. న్యాయవ్యవస్థనీ కించ పర్చడమే. ఏదైనా దర్జాగా చేయాలి. కానీ నేను పోయి విశాఖలో కూర్చుని పరిపాలన చేస్తా.. ఏ చట్టమూ నన్ను ఆపలేదు అంటే.. ఎవరూ ఆపలేరు. ఎందుకంటే సీఎం ఫలానా చోట ఉండాలనేం లేదు. కానీ నమ్మి ఓట్లేసిన ప్రజలకు సమాధానం చెప్పాలి గా ?. అలా వెళ్లదల్చుకుంటే.. ఏప్రిల్ వరకూ అవసరం లేదు.. రేపే వెళ్లి ఎక్కడో చోట కూర్చుని పనులు చేసుకోవచ్చు. పరిపాలించవచ్చు. కానీ అప్పుడు తుగ్లక్ 2.0 అంటారు కానీ… రాజనీతిజ్ఞుడి పాలన అనరు. అదే తేడా. గుడివాడ అమర్నాథ్ అంచనా వేసుకుంటారో లేదో మరి !