వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు వాలంటీర్లు ఇప్పుడు తమ కన్నా గొప్ప వ్యక్తులుగా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా వాలంటీర్లను.. బతిమాలుతున్నారు. పథకాలు ఎవరు ఇస్తున్నారంటే జగన్ ఇస్తున్నారని చెప్పాలని అంటున్నారు. మొన్న ధర్మాన ప్రసాదరావు అదే చెప్పారు.. నిన్న తానేటివనిత కూడా అదే అంటున్నారు. పథకాలు ఇచ్చేది జగనేనని చెప్పాలని వారంటున్నారు. తమకు ఓటేస్తే జగన్ కు వేసినట్లేనని వారి అర్థం. వాలంటీర్లను మంత్రులు ఇలా బతి్మాలుకోవడాన్ని వైసీపీ క్యాడర్ కూడా ఆశ్చర్యపోయి చూస్తోంది.
వాలంటీర్లు పూర్తిగా వైసీపీ కనుసన్నల్లో పని చేస్తారు. కానీ నేతల కనుసన్నల్లో కాదు. అధికారులు చెప్పినట్లుగా చేస్తారు. తమ యాభై ఇళ్ల పరిధిలో వాళ్లు చెప్పినట్లుగానే జరుగుతుంది. పథకాలు ఇవ్వాలన్నా.. తీసేయాలన్నా వారి చేతుల్లోనే ఉంది. దీంతో వారు .. తామే ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. వైసీపీ, జగన్ గురించి చెప్పేది తక్కువ అయిపోయింది. ఈ పరిస్థితిని గమనించి సీఎం జగన్ కొత్తగా కవర్లలో డబ్బులు పెట్టి ఇస్తున్నారు. కవర్లలో 2750 పెన్షన్ పెట్టి ఇస్తున్నారు. ఆ కవర్ పైన జగన్ బొమ్మ ఉంటోంది. జగన్ ఆ పెన్షన్ ఇస్తున్నట్లుగా చెప్పుకోవాలని వారి తపన.
వాలంటీర్లు మరీ చేతికి అందకుండా పోతున్నారని కొత్తగా గృహసారధుల్ని జగన్ నియమించమని పార్టీ నేతలను ఆదేశించారు. ఇప్పుడు వాలంటీర్లతో పాటు పించన్ ఇవ్వడానికి గృహసారధులు కూడా వెళ్తారని.. వాళ్లంతా పించన్ తీసుకునేవాళ్ల బ్రెయిన్ వాష్ చేస్తారని.. జగనన్న డబ్బులు ఇస్తున్నారని చెబుతారని అంటున్నారు. అయితే ఒక్క పెన్షన్ ఇవ్వడానికి ఇంత మందా అనే డౌట్ అవ్వాతాతలకు కూడా రావొచ్చు.
కారణం ఏమైనా వాలంటీర్లకు అందరూ లోకువైపోయారు. మంత్రులు కూడా బతిమాలుకుంటున్నారు. ముందు ముందు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.