వైకాపా ఎమ్మెల్యే రోజా తాజాగా కొన్ని విమర్శలు చేశారు! చేస్తున్న విమర్శల్లో లాజిక్ ఉందా లేదా, మాట్లాడుతున్నది సందర్భోచితంగా ఉందా లేదా అనే క్రాస్ చెక్ ఉండాలి కదా. ఇంతకీ రోజా ఏమన్నారంటే… డ్వాక్రా మహిళలను సీఎం చంద్రబాబు నిలువునా మోసం చేశారన్నారు. పథకాలను కూడా వ్యాపారంగా మార్చేశారన్నారు. టీడీపీ నేతలకు తాను సవాల్ చేస్తున్నాననీ, మీ ఇంట్లో ఆడవాళ్ల తాళిబొట్ల మీద ప్రమాణం చేసి, ఈ మూడు చెక్కులు ఇస్తున్నది డ్రామా కాదని చెప్పగలరా అన్నారు! మూడు చెక్కులు, సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఆడవాళ్లు ఓటేస్తారనే భ్రమలో ఉన్నారన్నారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మూడు చెక్కులూ రద్దు చేసి… ఏకంగా పదివేల రూపాయల సొమ్ము వారి చేతికిస్తే, నిజంగానే వారికి న్యాయం చేసినట్టు అవుతుందన్నారు.
చెక్కులు ఇవ్వడమే వ్యాపారమనీ, ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నమని విమర్శించిన ఎమ్మెల్యే రోజా… ఆ కాసేపట్లోనే, చెక్కులు రద్దు చేసి పదివేలు ఇచ్చేస్తే న్యాయం చేసినట్టు అవుతుందన్నారు! అంటే.. చెక్కుల రూపంలో ఇస్తే అది డ్రామా అని అన్నారు, నేరుగా డబ్బులు ఇచ్చేస్తే అది న్యాయం అంటున్నారు. రెండింటికీ తేడా ఏముంది? ఇంతకీ… ప్రభుత్వం అమలు చేస్తున్న పసుపు కుంకుమ గురించి రోజా ఏం చెప్పాలనుకున్నారు..?
ముఖ్యమంత్రి చంద్రబాబుకి తిరుపతి వెంకన్న అంటే భయమూ గౌరవం లేదన్నారు రోజా! ఇదే వెంకన్న సాక్షిగా మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారన్నారు. అదే మాట చెప్పి వెంకన్న మీద ఒట్టేశారనీ, కానీ ఈరోజున చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుని… జగన్ మోహన్ రెడ్డి పుణ్యమా అని మాట్లాడుతున్నారని అన్నారు. ఢిల్లీలో దీక్షలు పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారన్నారు.
తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది ఎవరూ… నాటి ప్రధాని అభ్యర్థి మోడీ. ఇస్తామని 1చెప్పారు కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రమే తీర్చాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు నమ్మారు. ఎన్నికల తరువాత హోదా ఇవ్వాల్సింది కేంద్రమే కదా! ఇవ్వకుండా నాలుగేళ్లు నాన్చింది, ఎదురుచూసి విసిగిన రాష్ట్ర ప్రభుత్వం పోరాటం తరువాత ప్రారంభించింది. అంటే, హోదా తెస్తామని చెప్పిన టీడీపీ ప్రయత్నం చేస్తున్నట్టా లేదా..? నేడు ఢిల్లీలో సీఎం దీక్ష ఆ ప్రయత్నంలో భాగమా కాదా..? హోదా తెస్తామని చెప్పిన చంద్రబాబు ప్రయత్నం కొనసాగుతున్నట్టా లేదా..? మరి, ఇస్తామని చెప్పిన మోడీ మాట నిలబెట్టుకున్నట్టా..? సమస్య ఎక్కడుందో ప్రజలందరికీ తెలిశాక… ఇప్పుడు కూడా ఇలా లాజిక్ లేకుండా మాట్లాడుతూ, తిరుపతిలో వెంకన్న సాక్షిగా చంద్రబాబు కూడా హామీ ఇచ్చారని రోజా విమర్శించడాన్ని ఏమనుకోవాలి..? ఏపీ హోదాకి కట్టుబడి ఉన్నారు కాబట్టే, ఇంకా పోరాటం చేస్తున్నారు.