వైసీపీలో ఎమ్మెల్యేలు ఇప్పుడు ఫైర్ మీద ఉన్నారు. బయటపడకపోయినా కోటంరెడ్డికి ఫుల్ సపోర్ట్ ప్రకటించేవారు లెక్కలేనంత మంది ఉన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా సమయం ఉండటంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తారని అంటున్నారు. కారణం ఏదైనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్లో తమ పార్టీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి ఉందనేది మాత్రం ఆ పార్టీలో ఎక్కువగా వినిపించే అంశం దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఎమ్మెల్యేల్ని కట్టు బానిసలుగా చూడటం.
వాలంటీర్ల కన్నా అలుసైపోయారే ఎమ్మెల్యేలు !
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. దీనికి కారణం ఏ సమస్య ఉన్నా వాలంటీర్ నే సంప్రదిస్తున్నారు జనం. పథకాలు ఇవ్వాలన్నా.. తీసేయాలన్న వాలంటీర్ చేతిలోనే పెట్టారు. దీనిపై పలుమార్లు ఎమ్మెల్యేలు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. వాలంటీర్లకు ఉన్నంత గౌరవం కూడా లేదని బహిరంగంగానే చెప్పారు. వాలంటీర్లు తమను లెక్క చేయడం లేదని.. వాపోయిన ఎమ్మెల్యేలకు లెక్కే లేదు. అంతిమంగా ఎమ్మెల్యే పదవిని వాలంటీర్ కు లోకువ చేశారనే కోపం వారిలో ఉంది.
అలుసు చేస్తున్ ఐప్యాక్ టీమ్స్ !
మరో వైపు సీఎం జగన్ సొంత పార్టీ నేతల కన్నా… పొలిటికల్ స్ట్రాటజీ టీమ్ ఐ ప్యాక్ బృందాలనే ఎక్కువగా నమ్ముతారు. వారు ఇచ్చే సర్వేలు.. రిపోర్టులనే హైలెట్ చేసి.. ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతూంటారు. ఇది చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలకు కష్టంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు ఇవ్వాలా వద్దా అనేది ఐప్యాక్ డిసైడ్ చేస్తుందని చెప్పడం కూడా చాలా మందిలో అభద్రతా భావాన్ని కల్పించింది. గత ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు పెట్టుకుని గెలిచామని.. కనీసం చేస్తున్న పనులకు బిల్లులకు కూడా ఇప్పించుకోలేని పరిస్థితి ఉన్నా… పార్టీ కోసం పని చేస్తున్నామని..అయినా గుర్తించడం లేదన్న భావనలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
సీఎం ముఖం చూడని ఎమ్మెల్యేలు ఎంత మందో ?
అదే సమయంలో సీఎం జగన్ అపాయింట్మెంట్ పొందలేని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఏదో ఓ సందర్భంలో కలవడం తప్ప… నియోజకవర్గ సమస్యలు చెప్పుకుందామనుకుంటే సమయం దొరికిన వారు చాలా తక్కువ. ఈ కారణంగా కూడా ఎమ్మెల్యేలకు హైకమాండ్‌కు మధ్య గ్యాప్ పెరిగిపోయిందన్న వాదన వినిపిస్తోంది. సీఎంను కలవాలంటే సజ్జల రామకృష్ణారెడ్డిని దాటాలి. ఆయన ఏదైనా తనకు చెప్పేసి వెళ్లమంటారు. కానీ జగన్ దాకా పోనీయరు. ఇలా కనీసం వంద మంది ఎమ్మెల్యేలకు జగన్ ఇంటర్యూ దక్కనట్లుగా తెలుస్తోంది.
ప్రత్యేక వర్గాన్ని పెంచుకుంటున్న సజ్జల !
సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయం కూడా వైసీపీలో అలజడికి కారణం అవుతోంది. ఆయన తన సన్నిహితులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. తనకు అనుచరులుగా ఉండేవారికి గుర్తింపునిస్తున్నారు. జగన్ తీసుకునే నిర్ణయాలన్నీ సజ్జల తీసుకునేవే. దీంతో వైసీపీలో అలజడి పెరిగిపోయింది. అది ఏ స్థాయికి వెళ్తుందో ముందు ముందు తెలుస్తుంది.