తాడేపల్లిలో వైసీపీ ఆఫీసు గా ఉన్న అద్దాలమేడ ఖాళీ అయింది. ఆ ఆఫీసులో ఉన్న చివరి కుర్చీని కూడా తీసుకెళ్లిపోయారు. ఆ బిల్డింగ్ యజమానికి ఇంత కాలం ఎంత అద్దె ఇచ్చారో కానీ… ఇప్పుడు అదంతా మిగుల్చుకోవడానికి ఆఫీసును ఖాళీ చేసేశారు. పార్టీ ఆఫీసును.. ప్రజాధనంతో ముస్తాబు చేసుకున్న ఇంటికి తరలించారు. గతంలో తన క్యాంప్ ఆఫీసుగా ఉన్న ఇంటిని ఇప్పుడు పార్టీ ఆఫీసుగా మార్చారు.
తాడేపల్లి ప్యాలెస్ లోకి మార్చిన పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసే రూమ్ కూడా ఏర్పాటు చేశారు ., ఎవరూ తాడేపల్లి ప్యాలెస్ లోపలకు వెళ్లే చాన్స్ లేకుండా… ప్రధాన గేటు దగ్గర నుంచి ఓ గ్రిల్ ఏర్పాటు చేసి… మీడియా సమావేశాలు నిర్వహించే రూమ్ ను ఏర్పాటు చేశారు. జర్నలిస్టులు.. ఏదో జైల్లోకి వెళ్తున్నట్లుగా అందులోకి వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుంది.
ఇప్పటికే అనేక చోట్ల వైసీపీ ఆఫీసులు మూత పడుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియాను నిర్వహించిన మంగళగిరిలోని భవనాన్ని ఎప్పుడో ఖాళీ చేశారు. విజయవాడలో ఐ ప్యాక్ ఆఫీసుకు కూడా టూలెట్ బోర్డు పెట్టారు. ఇప్పుడు నేరుగా వైసీపీ ఆఫీసుకే పెట్టారు. కొద్ది రోజుల కిందట మైలవరం పార్టీ ఆఫీసును అద్దె కట్టకుండా మూసేసిన వైనం కూడా వైరల్ అయింది. ఇక కుప్పం ఆఫీసును అమరావతి హోటల్ గా మార్చారు. ముందు ముందు వైసీపీకి ఇలాంటి టూలెట్ బోర్డుల అవసరం బాగా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.