న్యూడ్ వీడియో వివాదం కారణంగా ఏర్పడిన డ్యామేజీని.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వైసీపీ హైకమాండ్ ఉపఎన్నిక ఆలోచన చేసే చాన్స్ కనిపిస్తోంది. ఆ వీడియో నిజమైతే కఠినాతి కఠినమైన నిర్ణయాలు తీసుకంటామని సజ్జల చెప్పారు. అంటే ఆయనతో పార్టీకి కాకుండా.. ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. గోరంట్లతో రాజీనామా చేయించి.. ఆ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించడం ద్వారా ప్రజాభిప్రాయం తమకే అనుకూలంగా ఉందని నిరూపించాలని వైఎస్ఆర్సీపీ వ్యూహం పన్నే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో ఇదే రాజకీయం నడుస్తోంది. అక్కడ మునుగోడులో ఉపఎన్నిక నిర్వహించి.. గెలవడం ద్వారా గాలి తమదేనని నిరూపించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అలా హిందూపురంలో కూడా తాము గెలిచి.. గాలి తమదేనని నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో కేక్ వాక్ అవుతుందన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. గోరంట్ల మాధవ్ దూకుడైన ప్రవర్తన. అసభ్యకరమైన భాషాప్రయోగంతో సొంతపార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తిని మూటగట్టుకున్నారు. ఆయనపై అత్యాచారం, హత్య వంటి కేసులు ఉండటం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ కారణంగా ఆయనపై చర్యలుతీసుకున్నట్లు ఉంటుందని… అలాగే ఇమేజ్ పెంచుకున్నట్లు ఉంటుందని అనుకుంటున్నారు.
ఉపఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీకే అనుకూల ఫలితం వస్తుంది. ఇంకా ఇరవై నెలల వరకూ పదవీ కాలం ఉన్న ఎంపీ స్థానానికి ఎన్నికలు జరిగితే ఏడు అసెంబ్లీ స్థానాల్లో వచ్చే మెజార్టీలను బట్టి తమ స్థానం సుస్థిరంగా ఉందని విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని నమ్మడం లేదని నిరూపించే అవకాశం వైఎస్ఆర్సీపీకి లభిస్తుంది. ఈ ఆప్షన్పై వైఎస్ఆర్సీపీ హైకమాండ్ గట్టిగా కసరత్తు చేస్తే గోరంట్లతో నేరుగా రాజీనామా చేయించే అవకాశాలున్నాయని భావించవచ్చు.