గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన.. వల్లభనేని వంశీపై… ఓ రకంగా… ముప్పేట దాడి జరుగుతోంది. ఎన్నికలకు ముందు నుంచీ ఆయన టార్గెట్‌గా.. రకరకాల రాజకీయాలు నడిచాయి. అవి ఇప్పుడూ కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం… వల్లభనేని వంశీ బెదిరిస్తున్నారంటూ… ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన దాసరి బాలవర్ధనరావు.. విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. ఆ బెదిరింపుల ఆరోపణలు కూడా.. కాస్త అటూ ఇటూగా ఉన్నాయి. వంశీ సన్మానం చేస్తానంటూ.. ఇంటికొస్తున్నారని… తనకు రక్షణ కావాలని.. యార్లగడ్డ వెంకట్రావు అంటున్నారు. ఈ వివాదంలో ఉండగానే.. కొంత మంది వైసీపీ అనుకూల వర్గాలు.. వంశీ వైసీపీలోకి వస్తారంటూ… ప్రచారం ప్రారంభించారు. ఓ రకంగా.. ఆయనపై… టీడీపీ హైకమాండ్‌కు నమ్మకం సన్నగిల్లేలా చేయడమే ఈ ప్రచారం ఉద్దేశమని… వైసీపీ గేమ్ ప్లాన్ అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు.
అసలు ఎన్నికలకు ముందే.. వల్లభనేని వంశీని టీడీపీకి దూరం చేసే ప్రయత్నాలు జరిగాయి. ఆయనకు హైదరబాద్‌లోని కూకట్ పల్లి ప్రాంతంలో ఉన్న ఖరీదైన స్థలంపై లిటిగేషన్లు సృష్టించి.. వైసీపీలో చేరాలనే బెదిరిపుల్ని టీఆర్ఎస్ నేతలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత… కోర్టు కొట్టేసిన కేసుకు సంబంధించి… హైదరాబాద్ పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా పంపారు. ఇది కూడా వివాదాస్పదమయింది. ఏం జరిగినా.. తాను వెనక్కి తగ్గబోనని.. వల్లభనేని వంశీ.. ఎన్నికల పోరాటాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కూడా.. గన్నవరంలో కాస్త ఉద్రిక్తంగానే సాగింది. పోలింగ్ ముగిసిన తర్వాత.. కౌంటింగ్ దగ్గర పడుతున్న సమయంలో.. వంశీ టార్గెట్‌గా మరోసారి… రాజకీయం ప్రారంభమయింది.
కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధా ముగ్గురూ మంచి స్నేహితులే. కొడాలి నాని, వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నప్పుడు.. వంగవీటి రాధా… కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత కొడాలి నాని, వంగవీటి రాధా వైసీపీ నాయకులయ్యారు. కానీ వంశీ మాత్రం.. టీడీపీలోనే ఉండిపోయారు. అయితే.. కొన్నేళ్ల కిందట… గత అసెంబ్లీ ఎన్నికలకన్నా ముందు ఓ సందర్భంలో.. జగన్మోహన్ రెడ్డి… ఎదురయినప్పుడు… వల్లభనేని వంశీ ఆలింగనం చేసుకోవడం కలకలం రేపింది. అప్పట్నుంచి ఆయన కూడా వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. కానీ.. తర్వాత ఎలాగోలా.. పరిస్థితిని సర్దుబాటు చేసుకున్నారు. తీవ్ర అవమానాలతో.. వంగవీటి రాధా వైసీపీ నుంచి బయటకు వచ్చారు. కొడాలి నాని మాత్రమే వైసీపీలో ఉన్నారు. మళ్లీ ఈ సమయంలో… వంశీ కోసం.. వైసీపీ నేతలు.. రాజకీయం ప్రారంభించారని.. టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.