హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మొట్టమొదటి రాజ్యసభ సభ్యుడిని త్వరలో పార్లమెంట్‌కు పంపబోతోంది. వైసీపీకి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో 65 మంది సభ్యుల బలం ఉంది. దీనితో ఈ ఏడాది జూన్‌లో ఖాళీ అవనున్న నాలుగు రాజ్యసభ స్థానాలలో ఒకటి వైసీపీకి లభించనుంది. ఈ స్థానానికి ఎంవీ మైసూరారెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి పోటీపడుతున్నట్లు సమాచారం. దీనిపై పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరలో నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. పార్టీ వర్గాలు మాత్రం విజయసాయి రెడ్డికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నాయి. పార్టీని ప్రారంభించకముందునుంచీ జగన్‌కు వ్యాపార లావాదేవీల్లో విజయసాయిరెడ్డి అండదండలుగా ఉండి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని అతి తక్కువ కాలంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేసిన సంగతి తెలిసిందే. దానికితోడు పార్టీలో విజయసాయిరెడ్డిని మాత్రమే జగన్ నమ్ముతారని చెబుతున్నారు. అయితే మైసూరారెడ్డికి పార్లమెంట్ వ్యవహారాలలో విశేష అనుభవం ఉండటం ఆయన అభ్యర్థిత్వానికి కలిసొచ్చే అంశం. మరి రాజ్యసభ టికెట్ విషయంలో జగన్ అనుభవం, విశ్వసనీయతలలో దేనికి ఓటు వేస్తారో వేచి చూడాలి.