ఏపీ ప్రతిపక్ష పార్టీలో సీనియర్ నేతలున్నారు. అనుభవజ్ఞులు ఉన్నారు. అన్నిటికీ మించి రాజకీయ వ్యూహాలలో ఆరితేరిన ప్రముఖ సలహదారుని కూడా నియమించుకున్నారు. ఇంతమంది ఉన్నా వ్యూహాత్మక తప్పిదాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. త్వరలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు బయలుదేరుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన పాదయాత్ర ఏ జిల్లాలోకి ప్రవేశిస్తే, ఆ జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా ఖరారు చేశారు. అన్నీ బాగున్నాయిగానీ… జగన్ కంటే ముందుగానే కొంతమంది వైకాపా నేతలు పాదయాత్రలకు సిద్ధం కావడం కచ్చితంగా వ్యూహాత్మక లోపమే! గుంటూరు జిల్లా నరసరావు పేట శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాదయాత్ర మొదలుపెట్టేశారు. గుంటూరు నుంచి తిరుపతి వరకూ ఆయన పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనీ, జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తాను యాత్రకు బయలుదేరుతున్నా అంటూ కార్యక్రమం మొదలుపెట్టేశారు. ఆయనతోపాటు దాదాపు ఓ రెండువందల మంది కూడా తిరుమలకు పాదయాత్ర చేయబోతున్నారంటూ ప్రకటించేశారు.
ఓపక్క జగన్ పాదయాత్రకు బయలుదేరుతున్నారు కదా.. ఈలోగా ఇలాంటి కార్యక్రమాలు అవసరమా..? జగన్ పాదయాత్రను భారీ ఎత్తున ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నప్పుడు… ఈలోపుగానే ఇలాంటి చిన్నచిన్న యాత్రలు అంటూ ఇప్పట్నుంచీ హడావుడి చేసేస్తే ఆ తీవ్రత తగ్గిపోదా..! అయినా, పార్టీ అధినేత ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు.. దానికి మద్దతుగా నాయకులు నిలవాలి. దాన్ని అనుసరించాలి. అంతేతప్ప, అధినేతతో సమానంగా హడావుడికి ప్రయత్నించకూడదు. జగన్ కంటే ముందేగా వైకాపా నేతలు పాదయాత్రకు బయలుదేరడం సరైన వ్యూహం కాదు. ఇలాంటి ప్రయత్నాలను సదరు వ్యూహకర్తలు ఎవరో.. ముందుగా తెలుసుకుని వారించాలి కదా. పైగా, తాము యాత్ర చేస్తున్నది జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం నేతలు కూడా చెబుతున్నారు!
ఈ ‘ముఖ్యమంత్రి’ అనే మాటను వైకాపా నేతలు ఇకనైనా మానుకోవాలి. వైకాపా అధికారంలోకి వస్తే ఆయనే సీఎం అయ్యేది. జగన్ మాట్లాడినా అదే మాట, నాయకులు మాట్లాడినా అదే మాట! ఈ ప్రస్థావన తీసుకొచ్చిన ప్రతీసారీ జగన్ పదవీ కాంక్షే ప్రజల్లోకి వెళ్తుంది. సదరు వ్యూహకర్తలు ఎవరో.. వారికి ఇది అర్థం అవుతున్నట్టుగా లేదు. ప్రజల సమస్యల కోసం పోరాటాలు చేస్తున్నామని కనీసం నాయకులు కూడా చెప్పకపోతే ఎలా..? వారు కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలనే పోరాడుతున్నాం అంటున్నారు!