తమకు పని చేస్తే మహానుభావుడు.. అదే వేరే వారి దగ్గర చేరితే మాత్రం దొంగ నా.. అన్నట్లుగా ఉంటుంది వైసీపీతో వ్యవహారం. ప్రశాంత్ కిషోర్ ను వాళ్లు తిడుతున్న తీరు చూస్తే… వీరికి అదొక్కటి తప్ప.. మంచి, మానం, మర్యాద ఉండదా అని వైసీపీ వాళ్లే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి.
వ్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిసేందుకు వచ్చారని తెలియగానే వైసీపీ సోషల్ మీడియా బీహారీ దొంగ అని ఆయనను సంబోధించడం ప్రారంభించింది. ఒక రోజు తర్వాత బూతు మాస్టర్లను రంగంలోకి దించారు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా వంటి వాళ్లను ప్రయోగించారు. ప్రశాంత్ కిషోర్ ను అడ్డగోలుగా తిట్టడం ప్రారంభించారు. నిన్నటిదాకా మీతోనే కలిసి పని చేశాడు కదా అయ్య.. అలా ఎలా తిడతారు.. కాస్తంతయినా మర్యాద కాపాడుకోరా అని ఎవరైనా అనుకుంటే… పిచ్చివాళ్లారా.. మాకు మర్యాదేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
జగన్ రెడ్డి చెప్పిన లెక్క ప్రకారం.. వాళ్లను గెలిపించింది.. ప్రశాంత్ కిషోరే. అంటే.. ఎవరు గెలిపించారో.. వాళ్లపైనే విషం చిమ్ముతున్నారన్నమాట. ఇంత కంటే ఘోరం .. నమ్మక ద్రోహం ఏముంటుంది ?., ఆయన ఇంత కాలం వైసీపీకి చేశాడు… నచ్చలేదు. వెళ్లిపోయాడు. సరే ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడని వదిలేస్తే పోయేదానికి.. బూతులు తిట్టి ఏం సాధిస్తారు ?. బూతుల తప్ప ఏమీ తెలియని రాజకీయ పార్టీ వ్యవహారం ఇలాగే ఉంటుందని ప్రజలు అనుకోవాలేమో ?