వైఎస్ఆర్సీపీ మెల్లగా సజ్జల రామకృష్ణారెడ్డి గుప్పిట్లో చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది. వైఎస్ జగన్‌ను ఉత్సవ విగ్రహం చేసి పరిపాలన మొత్తం ఆయనే చేస్తున్నాడని.. ఆయన సకల శాఖ మంత్రి అంటూఇప్పటికీ విమర్శలు వస్తూండగా కొత్తగా ఆయన వైసీపీలో అన్ని విభాగాలను బంధువులతో నింపడం ప్రారంభించారు. తాజాగా వైసీపీ సోషల్ మీడియాను ఆయన తన కుమారుడు భార్గవ్ రెడ్డి చేతుల్లో పెట్టారు. ఈ మేరకు జగన్‌తోనే చెప్పించారు. ఇప్పటికే పార్టీపై సజ్జలకు జగన్ కన్నా ఎక్కువ పట్టు ఉంది. ప్రతీ అంశం సజ్జల ద్వారానే పార్టీ నేతలకు వెళ్తుంది.
సజ్జల ఎవరికి చెబితే వారికి మంత్రి పదవులు వచ్చాయి. ఆయన చల్లని చూపులు ఉంటే చాలు ఏదైనా లభిస్తుందన్న అభిప్రాయం వైసీపీలో ఉంది. పార్టీలో జగన్‌కు ఇంత స్థాయిలో పట్టు ఉందో లేదో పార్టీ నేతలకు తెలియదు. ఇప్పుడు అత్యంత పవర్ ఫుల్ సోషల్ మీడియా కూడా సజ్జల కుమారుడికి చేతికి వెళ్లింది. జగన్‌తో పాటు సజ్జల పైనా ఎలివేషన్లు ఇచ్చుకుని.. ఆయనను కూడా లీడర్‌గా ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఇదో మార్గం అనుకోవచ్చు. ఇటీవల వైసీపీకి తానే శాశ్వత అధ్యక్షుడినని జగన్ ప్రకటించుకున్నారు.
ఇలా ఎందుకు అంటే.. పార్టీని ఎవరూ స్వాధీనం చేసుకోకుండా అని సజ్జల కబుర్లు చెప్పారు. కానీ ఇప్పుడు అసలు అలాంటి థ్రెట్ జగన్‌కు నేరుగా సజ్జల నుంచే ఉన్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి పరస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో.. సజ్జల ఇప్పుడు పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఆయన పెత్తనం ఏ స్థాయికి వెళ్తుందో కానీ.. వైసీపీలో మాత్రం ఓ వర్గం సజ్జల తీరుపై రగిలిపోతోంది.