ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉంటుందని మేనిఫెస్టోలో పెడతామని వైకాపా మేనిఫెస్టో కమిటీ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే కొంత చర్చ మొదలైన సంగతి తెలిసిందే. గడచిన నాలుగేళ్లుగా అమరావతి కేంద్రంగానే పరిపాలన అంతా సాగుతూ ఉంటే, ఇప్పుడు కొత్తగా అమరావతి గురించి వైకాపా ఎందుకు మాట్లాడుతోందన్న అంశం చర్చనీయం అవుతోంది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అధికార పార్టీ నేతలతో చర్చించారు. రాజధాని విషయంలో లేనిపోని అనుమానాలను వైకాపా సృష్టిస్తోందన్నారు ముఖ్యమంత్రి. మేనిఫెస్టోలో రాజధాని ఇప్పుడు పెట్టడమేంటన్నారు. రాజధాని అమరావతిపై వైకాపా స్పందిస్తున్న తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే దిశగా పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం!
ఆంధ్రా రాజధాని అమరావతి అనేది ఎప్పుడో జరిగిపోయిన నిర్ణయం. అమరావతి కేంద్రంగానే పరిపాలన సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. హైకోర్టు ఏర్పడింది. శాశ్వత భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అన్ని రకాలుగా అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్న ఈ సమయంలో… రాజధాని గురించి కొత్తగా వైకాపా ఎందుకు మేనిఫెస్టోలో పెడుతోందనేది ప్రజల్లోకి టీడీపీ తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. రాజధాని నిర్మాణ విషయమై ప్రతిపక్ష నేత జగన్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారని తాము విమర్శలు చేశామనీ, అదే వాస్తవం అన్నట్టుగా వైకాపా తాజా స్పందన ఉందనేది టీడీపీ నేతల మాట.
ఆంధ్రా అభివృద్ధి విషయంలో వైకాపాకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనీ, ఉంటే ఇలాంటి వ్యాఖ్యానాలు చెయ్యదంటూ ప్రజలకు వివరించి, ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నంలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రాలో జగన్ గృహ ప్రవేశానికి ఒక రోజు ముందుగా.. అమరావతిలో రాజధాని ఉంటుందని ఆ పార్టీ తీర్మానించడంలో ఉన్న అంతరార్థం ఏంటనే అంశాన్ని ప్రశ్నించే దిశగా టీడీపీ వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఏ ఉద్దేశంతో వైకాపా మేనిఫెస్టో కమిటీ ఇలా వ్యాఖ్యానించిందోగానీ… రాజకీయంగా ఈ కామెంట్స్ ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితినే తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి. రాజధాని అమరావతికి జగన్ వ్యతిరేకంగా ఉన్నారనీ టీడీపీయే సృష్టించిందనీ, అందుకే తాము ఇలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని వైకాపా నేతలు ఇప్పుడు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, నాలుగేళ్లు ఆలస్యంగా అమరావతిని రాజధానిగా ఎందుకు గుర్తించినట్టు అనే ప్రశ్నకు వైకాపా నుంచి సరైన సమాధానం ఇంకా రావాల్సి ఉంది.