దేశవ్యాప్తంగా తొలి విడతగా జరుగుతున్న ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల నేర చరితను.. నేషనల్ ఎలక్షన్ వాచ్ గ్రూప్ అనే సంస్థ బయట పెట్టింది. ఇందులో 52 శాతం మంది అభ్యర్థులు తీవ్రమైన కేసులతో ఉన్న వారిని నిలబెట్టి.. వైసీపీ రికార్డు సృష్టించింది. నేర చరిత్ర ఉంటేనే వైసీపీలో ప్రాధాన్యం దక్కుతుందన్న విమర్శలు చాలా కాలం నుంచి ఉన్నాయి. అభ్యర్థులను చూసిన తర్వాత.. వారి నేర చరిత్రను అఫిడవిట్ల రూపంలో బయట పెట్టిన తర్వాత అదే నిజమని.. నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ బయట పెట్టింది. వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థులుగా నిలబడిన ఇరవై ఐదు మందిలో… 13 మంది పై కేసులు ఉన్నాయి. ఇందులో 10 మంది మరీ తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఏపీలో 25 మంది లోక్ సభ అభ్యర్థులు పోటీ చేస్తూండగా.. అందులో నలుగురిపై కేసులు ఉన్నాయి. ఇద్దరిపై మాత్రం సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది కేవలం ఎనిమిది శాతం మాత్రమే. తొలి విడతలో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలన్నింటితో పోలిస్తే.. ఇది చివరి స్థానం. మొదటి స్థానం వైసీపీలో ఉంది. రెండో స్థానంలో..కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీ కూడా దాదాపుగా అంతే నేరచరితుల్ని నిలబెట్టింది.
వైసీపీ అభ్యర్థుల్లో నిన్నామొన్నటిదాకా.. పోలీసుగా పని చేసిన హిందూపురం అభ్యర్థిపై కూడా క్రిమినల్ కేసు ఉంది. సీఐగా పని చేస్తూ.. వీఆర్ఎస్ తీసుకుని.. ఎన్నికల్లో హిందూపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల మాధవ్ పై క్రిమినల్ కేసు నమోదయి ఉంది. రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న మార్గాని భరత్ పై వరకట్న వేధింపు కేసు నమోదైంది. దీన్ని భరత్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. వీరి కుటుంబంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల రెడ్డిపై అక్రమ ఆయుధం, హత్యాయత్నం కేసుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల విధులు ఆటంకం కలిగించటం వంటి కేసులు నమోదయ్యాయి. రాజంపేట అభ్యర్థి మిథున్ రెడ్డిపై మారణాయుధాలు కలిగి ఉండటంతో పాటు…., ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించటం, వస్తువులు ధ్వంసం చేయటం, అనుమతి లేకుండా ప్రవేశం వంటి కేసులు ఉన్నాయనే విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. కడప అభ్యర్థి అవినాష్ రెడ్డి కి సంబంధించి మారణాయుధాలు అక్రమంగా కలిగి ఉండటం, వ్యక్తులు తమ విధులు నిర్వర్తించుకోకుండా అడ్డుకోవటం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించటం వంటి కేసులు పై 147, 148, 188, 353, 120బీ తదితర అనేక కేసులు నమోదయ్యాయి. మచిలీపట్నం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలశౌరిపై చెక్ బౌన్స్ కేసులు ున్నాయి. విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ పై ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సీబీఐ కేసు నమోదై ఉంది. నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిపై 420 చీటింగ్ కేసుతో పాటు సెక్షన్ 407 కేసులు నమోదయి ఉన్నాయి. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మారణాయుధాలు కలిగి ఉండటం, హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించటం, ఎన్నికల్లో అక్రమ డబ్బు పంపిణీ, పర్యావరణ కలుషితం, చీటింగ్ కేసు, ఫోర్జరీ, సహజ ఖనిజాల దోపిడీ వంటి అనేక కేసులు ఉన్నాయి. విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ పై న్యూసెన్స్ కేసుతో పాటు అక్రమ ప్రవేశం, దొంగతనం, క్రిమినల్ వంటి కేసులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణమ రాజు కూడా అధిక కేసుల్లో పోటీ పడ్డారు. చెక్ బౌన్స్ కేసులతో పాటు సీబీఐ జేడీ కాల్ డేటా దుర్వినియోగం, ఆర్థిక లావాదేవీలు సక్రమంగా నిర్వహించకపోవటం, రెవెన్యూ చట్టం దుర్వినియోగం, పలు మార్లు ఆస్తుల రికవరీ. డబ్బు రికవరీ చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇలా దాదాపు 15కేసులు నమోదై ఉన్నాయి.
ఇక వైసీపీ తరపున పోటీ చేస్తున్న అసెంబ్లీ అభ్యర్థుల్లోనూ నేర చరితులు ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థుల్లో 95 మంది అభ్యర్ధులపై క్రిమినల్ కేసులున్నాయి. CBI, ACB, ED కేసుల్లో ఇరుక్కున్న వారు ఎనిమిది మంది ఉన్నారు. 12 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి గౌరవానికి భంగం కలిగించిన నలుగురిని ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారు. ఐదుగురిపై దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి పై ఎరువుల కల్తీ, ఇతర కేసులున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు… వైసీపీ అభ్యర్థుల కేసుల వివరాలన్నీ బయటకు తీస్తున్నారు. చాలా మంది తమ అఫిడవిట్లలో కేసుల వివరాలు బయట పెట్టలేదంటున్నారు. దాదాపుగా 150 మంది వైసీపీ అభ్యర్థులపై కేసులున్నాయని.. టీడీపీ నేతలు అంటున్నారు.